calender_icon.png 24 November, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య వ్యాపారం కాకూడదు!

21-11-2025 12:00:00 AM

భారతదేశ తొలి విద్యాశాఖ మం త్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (నవంబర్ 11) పురస్కరించుకొని ఏటా జాతీయ విద్యా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. అయితే గత వారం లోనే అటు మౌలానా జయంతితో పాటు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినోత్సవాలను పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. ఒకరు దేశ విద్యా రంగాన్ని బలోపేతం చేస్తే మరొకరు దేశాన్ని పారిశ్రామికంగా ఆర్థికంగా నిర్మించారు.

జాతీయ విద్యా దినోత్సవం రోజున దేశ విద్యా విధానాలు చర్చిస్తే.. బాలల దినోత్సవం రోజున  పిల్లల సంక్షేమం, విద్య, వైద్యం, బాలల హక్కుల వంటి అం శాలు చర్చకు వస్తాయి. ఈ నేపథ్యంలో ఆ మహనీయులు వేసిన పునాదుల నుంచి ప్రస్తుత పరిస్తుతులు ఎలా ఉన్నాయనేది ఒకసారి సమీక్షించుకోవాల్సిన అవసరముంది. సంక్షేమం, విద్య, వైద్యం పిల్లలం దరికీ సరిగ్గా అందుతుందా? లేదా అనేది ఆలోచించాలి.

నేటి బాలలే రేపటి పౌరు లు.. వారే నవ సమాజ నిర్మాణాలు అం టూ ఆకాశానికి ఎత్తేస్తారు.  కానీ దేశమం తా  సేవగా  అందాల్సిన విద్య , వైద్యం నేడు వ్యాపారంగా మారిపోయిందనడం లో అతిశయోక్తి లేదు. విద్యతోనే జ్ఞానం వికసిస్తుంది. జ్ఞానమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది. ఉన్నత స్థాయితో సమాజంలో గౌరవం దక్కుతుంది. వ్యక్తి త్వం వికసిస్తుంది.

వ్యక్తిత్వ వికాసమే సమాజానికి, దేశానికి శ్రేయస్కరం. కానీ మన దేశ విద్యా విధానం దీనికి భిన్నంగా ఉంది. కార్పొరేట్ కబంధహస్తాల్లో నలిగిపోతున్న విద్యా, వైద్యం వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. భారతీయ విద్య కమిషన్ (కొఠారి కమిషన్) నివేదికలో ప్రధాన సూచిక 6- నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కచ్చితంగా ఉచిత నిర్భంధ విద్యను అందించాలని సూచించింది. 

ప్రాథమిక విద్యకు దూరంగా!

కానీ ఇప్పటికీ దేశంలో ప్రాథమిక విద్య కు దూరమవుతున్న పిల్లలే అధికంగా ఉన్నారు. వీరిలో పట్నంతో పోలిస్తే పల్లె ల్లో.. ధనికులతో పోలిస్తే పేదల్లో , అల్పసంఖ్యాక బడుగు బలహీనవర్గాలు, వలస కార్మికుల పిల్లలే ఎక్కువగా ఉండడం గమనార్హం. నేషనల్ మైగ్రేషన్ సర్వే 2020---21 ప్రకారం దేశంలో వలసదారుల సంఖ్య 28.91 శాతంగా ఉంది. దీనిలో ఎక్కువ శాతం వలసలకు ప్రధాన కారణం సరైన ఉపాధి లేకపోవడమే.

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు పొట్టకూటి కోసం వలసగా నిర్మాణ రంగం, తయారీరంగం, ఇటుక బట్టీ కేంద్రాల్లో కూలీలుగా మారుతుండడం, పిల్లలను కూడా వారి వెంట తీసుకెళ్తుండడంతో కనీస ప్రాథమిక విద్య కు దూరమవుతూ వస్తున్నారు. పేగు ఆకలని అలమటిస్తుంటే మనసు బడి వైపు చూస్తుందా! కడుపును చూస్తుందా అన్నట్టుగా వలసదారుల పిల్లల బాల్యం బడికి దూరమవుతుంది. వలసదారుల కుటుంబాల్లో ఎక్కువ శాతం పిల్లలు చదువుకు దూరంగా ఉంటున్నారు.

వలసదారులకు ఆర్థికంగా ఉపొయోగపడేలా ‘వన్ నేషన్-వన్ రేషన్’ పథకం లాంటివి తీసుకొచ్చి నప్పటికీ, అది పూట గడవడానికే మాత్ర మే ఉపయోగపడే పథకం. కానీ వారి పిల్ల లు విద్యావంతులు కావడానికి మాత్రం విద్యకు సంబంధించిన పథకాలు ప్రవేశపెట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. దేశంలో విద్యకు దూరమయ్యేవారు కొందరైతే, విద్య మధ్యలో మానేసి బాల కార్మికులుగా మరేవారు కొందరున్నారు.

తాజా నివేదిక ప్రకారం 2023--24 తో పోలిస్తే 2024--25లో దేశంలో స్టూడెంట్ డ్రాప్ ఔట్ రేటు 7.6 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. ఇది  2030 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సార్వత్రిక పాఠశాల విద్య (పిల్లలందరికీ ఉచిత నిర్భంధ విద్య) లక్ష్యానికి చాలా దూరంలో ఉందనే చెప్పొచ్చు. ఇక బడికి వెళ్ళే విద్యార్థుల విషయానికి వస్తె ఆర్థిక స్థితిని బట్టి విద్య మారుతోంది. 

నివేదికలకే పరిమితం..

దేశంలో తొలి విద్యా కమిషన్ అయిన కొఠారి కమిషన్ నివేదికలో తొలి మాటగా దేశ భవిష్యత్తు తరగతి గదులలో నిర్మాణం అవుతుందని రాశారు. కానీ మన దేహం నిర్మితమయ్యే తల్లి గర్భం అందర్నీ సమానంగా చూసినా, దేశ భవిష్యత్ నిర్మాణం అయ్యే తరగతిగది మాత్రం అంతరాలను బట్టి మారుతూ వస్తోంది. దేశంలో కార్పొరేట్ టెక్నో, ఈ-టెక్నో ,డీజీ, ఇంటర్నేషనల్ పాఠశాలల పేర్లతో విద్య వ్యాపారంగా మారిపోతుంటే.. అదే సమయంలో ప్రభు త్వ గురుకులాలు, పాఠశాలలు మాత్రం కేవలం పేద, బడుగు, బలహీనవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి.

పేదరికం, అంటరానితనం చాటున విద్య, విద్యార్థి ప్రతిభ కనుమరుగైపోతున్నాయి. లక్షలు వ్యయం చేసి కార్పోరేట్ పాఠశాలలు, కళాశాల్లో చదువుకొని నిపుణుల ఆధ్వర్యంలో నిరంతరం శిక్షణ పొంది ఉన్నత శిఖరాలకు అధిరోహించిన వారిలో కొందరే ఉన్నప్పటికీ.. ప్రతిభ ఉండి కూడా డబ్బు, మౌలిక వసతులు, సరైన శిక్షణ లేక నిరుపేద కుటుంబాల పిల్లలకు మాత్రం సంఘంలో ఉన్నత స్థానం సాధించే అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తుండడం గొప్ప విషయం.

ఎందుకంటే మనదేశంలో  ఏ అంతరంలో (కార్పొరేట్, డీజీ, ఇంటర్నేషనల్, ప్రభుత్వ, గురుకులాలు పాఠశాలలు) చదివినా ఒకే ఉద్యోగ, విద్యాప్రవేశ అర్హతకు మాత్రం అందరికీ సమాన పరీక్షలే ఉంటాయి. దీనివల్ల విద్య అందరికీ సమానమనే భావన ఎప్పటికీ కలుగుతూనే ఉంటుంది. 

సమసమాజ స్థాపన కోసం..

ఇక భారత్‌లో విద్య వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం మన దేశంలో ఆచ రిస్తున్న సిలబస్. దేశంలో ఏళ్లుగా వస్తున్న సిలబస్‌నే ఇప్పటికీ చాలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధిస్తున్నారు. సిద్ధాంతాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులకు, పరిశ్రమకు అవసరమైన ఆచర ణాత్మక నైపుణ్యాలు లోపిస్తున్నాయి. గుడ్డి గా బట్టీ పట్టే విధానం వల్ల పిల్లల్లో పరిశోధన, ఆవిష్కరణ, కొత్త ఆలోచనలు చేసే సామర్థ్యం దెబ్బతింటోంది.

కొన్ని ప్రైవేటు సంస్థలు ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థల్లో ఆ మేరకు చర్యలు లేకపోవడంతో మెజారిటీ విద్యార్థులు పాత పద్ధతుల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పరిశోధనలు, ఆవిష్కరణల పరంగా భారత్ భవిష్యత్తులో ప్రపంచ దేశాల కంటే వెనుకబడిపోయే ప్రమాదముంది. భారతదేశ విద్యారంగంలో ప్రపంచంలోనే మెరు గైన స్థాయికి ఎదగాలంటే మన విద్యా విధానాన్ని పూర్తిగా పునర్నిర్మించాలి.

జాతీ య విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 లక్ష్యాలను సమర్థంగా అమలు చేయాలి. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుం డా ప్రయోగశాలలు, ప్రాజెక్టులు, ఫీల్డ్ ట్రిప్ ద్వారా విద్యను బోధించాలి. చాలా విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ రంగం లో ఫీజుల వసూళ్లపై అధిక దృష్టిని సారిస్తున్నాయి. ఈ ధోరణిలో మార్పు రావా ల్సిన అవసరముంది. లాభాపేక్ష కంటే విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి పెట్టాలి.

దేశంలో రాజకీయ, ఉద్యోగ, వ్యాపారవేత్తల పిల్లల నుంచి కూలీల, కార్మికుల పిల్లల వరకు పేద, ధనిక అనే తేడా లేకుండా విద్య వ్యాపారం కాకుండా సేవగా అందినప్పుడే దేశాభివృద్ధితో పాటు అన్ని వర్గాల సమసమాజ స్థాపనకు తోడ్పడుతుంది.  దేశంలో అందరి సామాజిక ఆర్థిక పరిస్థితులు మారాలంటే అందరికీ సమాన విద్య దక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 వ్యాసకర్త: భైరబోయిన వెంకటేశ్వర్లు