calender_icon.png 24 November, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం కుర్చీపై నితీశ్!

21-11-2025 12:00:00 AM

బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన నితీశ్ కుమార్ రికార్డు స్థాయిలో పదోసారి ఆ రాష్ట్ర సీఎం కుర్చీపై ఆసీనులయ్యారు. గురువారం పట్నాలోని గాంధీ మైదానంలో నితీశ్ సహా 27 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నితీశ్ కుమార్ సుదీర్ఘకాలం ముఖ్య మంత్రిగా పనిచేయడంతో రాష్ర్ట రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. లాలూ, రబ్రీ దేవి పాలనలో ఉన్న ‘జంగిల్ రాజ్’కు భిన్నంగా.. సుపరిపరిపాలనతో కూడిన అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిచ్చి ‘సుశాసన్ బాబు’ అనే ఇమే జ్‌ను సంపాదించారు.

రాజకీయ చతురతతో తాను ఏ కూటమిలో ఉంటే ఆ కూటమికి ఓట్లు బదిలీ చేయగలిగే సామర్థ్యం నితీశ్ పొందారు. బీహార్‌లో నితీశ్ ప్రభావం ఒక కత్తికి రెండు వైపులా పదునులాంటిది. ఒకవైపు గొప్ప సంస్కరణల వాదిగా కీర్తి పొందితే.. మరోవైపు అస్థిర రాజకీయ నాయకుడిగా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ బీహార్ రాజకీయాలు మాత్రం ఎప్పు డూ నితీశ్ కేంద్ర బిందువుగానే తిరుగుతూ వచ్చాయి. 2005లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నితీశ్ అహర్నిశలు  రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేశాడనే పేరు సంపాదించారు.

ఇంజినీర్ కావడంతో పాలనలో తనదైన వ్యూహాలతో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.  సంకీర్ణ ప్రభుత్వాల్లోనూ 10 సార్లు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగడం అరుదైన విషయం. బీహార్ చరిత్రలో ఎవరూ ఇంతకాలం వరుసగా పాలించలేదన్నది నగ్నసత్యం. నితీశ్ విజయంలో ఈసారి మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. పాఠశాల బాలికలకు సైకిళ్లు పంపిణీ చేశారు. పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం, ఆర్థిక సాయం వంటి పథకాలతో బలమైన ముద్ర వేశారు.

పాత వారిని వదులుకోవడం, కొత్త కూటములు కట్ట డం, మళ్లీ పాత వాటిలోకి తిరిగి పోవడం.. నితీశ్ నిర్ణయాలు ఎప్పుడూ ధైర్యంగా, ఊహించని విధంగా ఉంటాయి. ఎప్పుడు ఏ కూటమిలోకి వెళ్లాలి, ఏ సమయంలో ఏ కూటమి నుంచి బయటికి రావాలి అనేది నితీష్ కుమార్ బాగా అవపోసన పట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గంలో 60వేల మంది లబ్ధిదారులకు నితీశ్ ప్రభుత్వం పదివేలు ఇవ్వకుంటే ఆ పార్టీ 25 స్థానాలకే పరిమితమయ్యేదని  జన్ సురాజ్  పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.

ఓట్లు పొందకపోవడం నేరం కాదని, అయితే అవినీతి, విభజన రాజకీయాలు మాత్రం తాను చేయలేదంటూ విమర్శలకు దిగడం ఆసక్తి కలిగించింది. ఏది ఏమైనా బీహార్ వాసుల జీవితాలను కొంతమేరకు అయినా మెరుగుపరిచిన నాయకుడిగా నితీశ్ మన్ననలు అందుకున్నారు. రాష్ర్టంలో వైద్య, విద్య ప్రమాణాలను మెరుగుపరిచారు. నితీశ్ పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా బీహార్ రాజకీయాల్లో మరోసారి సంకీర్ణ పాలన మొదలైంది.

అయితే ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా బీజేపీ ఆవిర్భవించడంతో ముఖ్యమైన విధాన నిర్ణయాలలో కొత్త సమీకరణాలు కనిపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంచనా వేయడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్  తన పాలనా మార్క్‌ను ఎలా చూపిస్తారన్నది చూడాలి. అంతిమంగా ఎన్డీయే భాగస్వామిగా నితీశ్ ఐదేళ్లు కొనసాగుతారా?లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.