22-01-2026 01:19:39 AM
జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి
జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జంగయ్య యాదవ్
హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో యాదవుల ఐక్యత, అభివృద్ధి కోసం ‘జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి’ కృషి చేస్తోందని సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ హబ్సిగూడలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిగె శ్రీనివాస్‌తోపాటు యాదవసంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో యాదవుల సంక్షేమం కోసం పాటుపడుతున్న వంటల జంగయ్య యాదవ్‌ను జాతీయ యాదవుల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఈ సందర్భంగా రాములు యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని యాదవుల మధ్య ఐక్యత, జాతి హక్కుల కోసం జంగయ్య యాదవ్ మరింతగా పాటు పడాలని కోరారు. వంటల జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం పెట్టుకున్నట్లుగానే యాదవ జాతి సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా పరిధిలో యాదవులకు కష్టం వస్తే సంఘం తరఫున సహాయసహకారాలు అందించేందుకు ముందుకు వస్తానని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా యాదవుల సమస్యలను పరిష్కరించేలా.. యాదవ యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల కల్పనలో సహకారం అందిస్తానని.. యాదవుల ఉపాధి కల్పనలోనూ సహకారం అందించేలా శ్రమిస్తానని జంగయ్య యాదవ్ తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కుందేళ్ల శ్రీనివాస్ యాదవ్, వెంకట నర్సయ్య యాదవ్, సింహా యాదవ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బద్దుల రమేశ్ యాదవ్, జాతీయ కార్యదర్శి కడారి రాములు యాదవ్, రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ అవిశెట్టి లక్ష్మి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి జక్కుల రాము యాదవ్ పాల్గొన్నారు.