24-07-2025 05:56:20 PM
నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విద్యాసామర్థ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) అన్నారు. సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని పాఠశాలలలో ఎఫ్ ఎల్ ఎన్, ఎల్ఐపి సామర్ధ్యాలు విద్యార్థుల్లో మెరుగుపరచబడాలని, అందుకు తగిన విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అన్ని పాఠశాలలలో గ్రంథాలయాలను చక్కగా వినియోగించుకోవాలని, అందుకు కమిటీలు ఏర్పాటు చేసి, సరైన రిజిస్టర్ లను ఉపయోగించి, విద్యార్థులకు పుస్తకాలు అందించి విద్యార్థులలో పఠనం పట్ల ఆసక్తిని పెంపొందించాలన్నారు.
పాఠశాలలో నిర్వహించిన అన్ని అంశాలను ఆన్లైన్లో నమోదు చేసి, రిపోర్ట్ లను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా తరచుగా రిపోర్టులు ఆధారంగా ప్రధానోపాధ్యాయులచే సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పొక్సో చట్టం గురించి విద్యార్థులలో అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని అంశాలను ఆన్లైన్ చేయడంలో అశ్రద్ధ వహించకుండా వెంట వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేసి జిల్లాను ముందంజలో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి.మహేందర్, బీరవెల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై.సాయన్న, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త జి.లింబాద్రి మరియు విద్యార్థులు కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.