05-08-2025 10:48:05 PM
దొంగ బిల్లులతో పట్టుబడ్డ అధికారులు
హనుమకొండ,(విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో విద్యార్థుల కు మరియు హాస్టల్ అధికారులకు మధ్య కట్టెల లొల్లి తారస్థాయికి చేరుకుంది. వంట సామాగ్రి మరియు వంట కు ఉపయోగించే కర్రలు తెప్పించే లెక్కల విషయంలో అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రతి రోజు పురుగులు పడ్డ అన్నం, పుచ్చిపోయిన కూరగాయలతో భోజనం వండుతున్నారని ఆరోపించారు. ప్రతిరోజు కూరగాయల తూకంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని, ఈరోజు లారీలో రావలసినటువంటి కట్టెలను ట్రాక్టర్లో వేసి తొమ్మిది క్వింటానులకు బిల్లులు తెచ్చి, మూడు క్వింటాళ్ల కట్టలను చూపిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్ ఏ విధంగా సమాధానం చెప్తారు అని ప్రశ్నించారు. కొందరు మెస్ లో పనిచేసేటువంటి ఉద్యోగులే ఇలాంటి వాటికి అవకాశం కల్పిస్తున్నారని వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆందోళన నిర్వహించారు. విద్యార్థుల ఆందోళన వల్ల కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ లో వంటకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా విద్యార్థులు ఆందోళన విరమించలేదు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆందోళన చేసిన విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సిఐ రవికుమార్ ఎస్ఐ, ఏఎస్ఐ, కానిస్టేబుల్స్ సిబ్బంది పాల్గొన్నారు.