calender_icon.png 4 August, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకలి కేకలు

29-07-2025 12:00:00 AM

ప్రపంచమంతా ఊహించిందే జరుగుతోంది. ఆకలితో గాజాలోని పలస్తినీయులు అలమటిస్తున్నారు. ఆగని ఇజ్రాయెల్ దాడుల మధ్య, విరామ సమయంలో ఆహారాన్ని అందించేందుకు వచ్చే లారీలను ఆకలికి తట్టుకోలేక చుట్టుముడుతున్న వేలాది మందితో అంతా అస్తవ్యస్తంగా వుందని ప్రపంచ ఆహార సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధులు చెపుతున్నారు. గాజా భూభాగంలో ఒక మూలకు నెట్టివేయబడిన పలస్తినీయులు టెంట్లలో కిక్కిరిసి బతుకీడిస్తున్నారు.

పారాషూట్లలో ఆహార పొట్లాలు ఎప్పుడు కింద పడతాయా, వాటిని తోపులాటల్లో చేజిక్కించుకోవడం ఎలా అనేది పలస్తీయుల నిత్యజీవన సమరంగా మారింది. పశ్చిమ దేశాల్లో గాజా ఆకలి చావులపై ప్రజల్లో వ్యక్తమవుతున్న నిరసన ప్రభుత్వాలను మానవతా సాయానికి పూనుకునేలా చేసింది. విమానాల్లో పంపిన ఆహార పొట్లాలు జారవిడిచినప్పుడు అవి చాలాసార్లు ఇజ్రాయెల్ మిలటరీ ప్రాంతాల్లోనే పడుతున్నాయి.

20 లక్షల మంది గాజా ప్రజలకు ఈ ఆహార పొట్లాలు ఏమూలకూ సరిపోవడం లేదు. గాజా జనాభాలో అనేక రోజులుగా తిండిలేని వారు మూడింట ఒక వంతు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే, దాదాపు 5 లక్షల మంది ఆకలితో అల్లాడుతున్నారు. వారిలో 90వేల మంది మహిళలు, చిన్నపిల్లలకు అత్యవసరంగా ఆహారం అందించాల్సి వుంది.

అనేక నెలలుగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్, అక్కడి ప్రజలకు ఆహారం, ఔషధాలు, ఇంధనం అందకుండా ఆంక్షలు విధించిన ఫలితంగా అక్కడ ఆహార కొరత ఏర్పడింది. పౌష్టికాహారం లోపించి తల్లుల ఒడిలో పిల్లలు ఎముకల గూడులా మిగిలారు. ఇజ్రాయెల్ విధించిన కఠిన నిబంధనలతో గత అక్టోబర్ నుంచి 122 మంది ఆకలికి బలయ్యారని పలస్తినా ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. గడిచిన రెండు రోజుల్లోనే కనీసం 9 మంది ఆకలితో చనిపోయారు.

ఇప్పుడు గాజాలో అనేకమంది బ్రెడ్డు దొరికినా, ఆ ముక్కలను మింగలేనంత అనారోగ్యంతో వున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో మృత్యువు గడపలో నిలబడివున్నారు. ఆకలితో మరణించిన వారిలో పిల్లలు 83 మంది వరకు వున్నారు. గాజాలో పసిపిల్లల ఆర్తనాదాలపై ప్రాన్స్‌లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని గమనించి, అధ్యక్షుడు మాక్రాన్ పాలస్తీనాను ఒక దేశంగా ప్రాన్స్ గుర్తిస్తున్నట్టు ప్రకటించారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్యత్వ దేశాల్లో, పాలస్తీనాను దేశంగా గుర్తింపునిచ్చినట్టు తెలిపిన మొదటి దేశం ప్రాన్స్. అయితే జీ7 దేశాల్లో బ్రిటన్, కెనడా.. మాక్రాన్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇజ్రాయెల్ సైనిక దాడులకు ఇప్పటికే దాదాపు 60 వేల మంది పలస్తినీయులు మరణించారు. యుద్ధకాలంలో ఐరాస సహాయ బృందాలు పంచిన ఆహారాన్ని తీసుకునేందుకు వెళ్లిన వారిపై కూడా ఇజ్రాయెల్ మిలటరీ కాల్పులు జరిపిన ఘటనలు ఉన్నాయి.

ఆ ఘటనల్లో వెయ్యిమంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణకు త్వరలో జరుగనున్న చర్చలపైనే పలస్తినీయులు ఆశలు నిలుపుకున్నారు. నేడో రేపో అన్నట్లుగా కాల్పుల విరమణ ఒప్పందం జరుగుతుందని అమెరికా కూడా గట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నది.