calender_icon.png 5 December, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో ఎన్నికల సందడి

05-12-2025 12:06:52 AM

పల్లెల్లో ఎవరిని కదిలించినా ఎన్నికల ముచ్చటే నడుస్తుంది. నలుగురు కలిస్తే సర్పంచ్, వార్డు మెంబర్లు ఎవరవుతారు అనే గుసగుసలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ర్టంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కావడంతో అభ్యర్థులంతా భారీ ర్యాలీలతో వచ్చి నామినేషన్లు వేశారు. అయితే ప్రతీ ఐదేళ్లకోసారి పంచాయతీ ఎన్నికలు జరపడం, పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని సర్పంచ్‌లు ప్రభుత్వాలను కోరడం పరిపాటిగా మారినప్పటికీ ప్రజా సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయి.

ప్రతీసారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం, సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పనలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో సరైన సీసీ రోడ్లు వేయకపోవడం, వీధి దీపాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో యువత కూడా పెద్ద ఎత్తున సర్పంచ్ పదవులకు పోటీ చేస్తుండడంతో పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందేమోనని గ్రామ ఓటర్లు ఆశపడుతున్నారు.

యువత కూడా గ్రామాల్లో ఏ సమస్యలు ఎక్కువగా ఉన్నాయో వాటిని ఒక పేపర్‌పై రాసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా తమను సర్పంచ్‌గా గెలిపిస్తే మొదటి ప్రాధాన్యత కింద సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. కొన్నిచోట్ల రాబోయే ఐదేళ్లు తాము గెలిచాక ఏమి చేస్తామన్నది ఒక బాండ్ పేపర్‌పై రాసి ప్రచారంలో ఓటర్ల కాళ్లు పట్టుకొని బతిమలాడడం గమనార్హం. అయితే హామీలు నెరవేర్చకుండా పోటీలోకి దిగుతున్న గత సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేయకుండా వారిని ఓడిస్తామని ఓటర్లు ఖరాఖండీగా చెబుతున్నారు. 

 కామిడి సతీష్, భూపాలపల్లి