30-01-2026 01:17:47 AM
హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్
పరకాల పురపాలక సంస్థలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ, జనవరి 29 (విజయక్రాంతి): నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటించాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.గురువారం హనుమకొండ జిల్లా పరకాల పురపాలక సంస్థలో 22 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పురపాలక సంస్థ కార్యాలయంలో కొనసాగుతుండగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు. 11 వార్డులకు ఒకటి చొప్పున మొత్తం 22 వార్డులకు గాను నామినేషన్ల స్వీకరణకు రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరిస్తుండగా వాటి వివరాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పురపాలక కమిషనర్ అంజయ్య, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సందేహాల నివృత్తి, సహాయం కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేసి రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ కు పురపాలక కమిషనర్ వివరించారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ మెటీరియల్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు, ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ల ద్వారా సహకారం అందించాలని అన్నారు. నామినేషన్ల అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయింపులో జాగ్రత్త వహించాలని సూచించారు. అధికారులు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పరకాల ఆర్డీవో డాక్టర్ కన్నం నారాయణ, తహసిల్దార్ విజయలక్ష్మి, టిపిఎస్ ఖురేషి, టీపిఓ సందీప్ రెడ్డి, ఏఈ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల పర్వం
పరకాల మున్సిపాలిటీ లో మొదటి రోజు 5 మంది నామినేషన్లు దాఖలు చేయగా, రెండవ రోజు గురువారం 39 మంది వివిధ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.