calender_icon.png 27 October, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాస్టిక్ నవ్వులు

27-10-2025 02:06:30 AM

మానవత్వానికిది ఎండాకాలం

దినదినం మనిషి గుండెలో

విలువల తడి అడుగంటి పోతుంది

ఆత్మీయత సడి సద్దుమణుగుతుంది

అవసరానికొక ముసుగేసుకుని 

మనుషుల ముఖాలు కృత్రిమ భావాల

నర్తనశాలలు అవుతున్నాయి !


సూర్యుడు 

తూర్పు తలుపు తెరవగానే

పచ్చనోట్ల సాగు కోసం 

మొదలయ్యే మానవుని పయనం 

చుక్కలు చీకటి దుప్పట్లో నక్కినా

ఆగడం లేదు !

ఎడతెగని ఈ యాంత్రిక జీవన గమనంలో

ఆత్మీయ పలకరింపుల జల్లులకు

ఇక సమయమెక్కడిది ?

ఒకటి అరజల్లు కురిసినా

ఏవో పొడి పొడి మాటల తుంపరలే !

విశ్వంలోని సుదూర గ్రహాలు

మనకు దగ్గరవుతున్న కొద్దీ

మనుషుల మధ్య అగాధాలు 

పెరుగుతున్నాయి


నేడు మానవ సంబంధాలన్నీ

అవసర‘అర్థ’మే!

సంచుల నుంచి సర్జరీల దాకా

జీవితమంతా ప్లాస్టిక్ మయమే

ఆఖరికి నవ్వులు కూడా !