calender_icon.png 27 September, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలను సవ్యంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలి

27-09-2025 12:18:18 AM

 జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి 

నల్గొండ టౌన్(విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సవ్యంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో కోరారు. శుక్రవారం  ఉదయాదిత్య భవన్లో గ్రామపంచాయతీ ఎన్నికలపై స్టేజి 1, స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులు, సహాయ రెటర్నింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

ఎన్నికలలో సొంత నిర్ణయాలను తీసుకోవద్దని, రాజ్యాంగబద్ధంగా నిర్వహించే ఎన్నికలలో తప్పులు జరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుండి ప్రతి ఉద్యోగి ఎన్నికల సంఘం నియంత్రణలో పనిచేయాల్సి ఉంటుందని, అందువల్ల తప్పులు జరగకుండా ఎన్నికల సంఘం జారీచేసిన హ్యాండ్ బుక్ ను, ఇతర నియమ, నిబంధనలను పూర్తిగా చదవడమే కాకుండా, ముఖ్యమైన అంశాలను మార్కు చేసుకోవాలన్నారు. ఏ పోలింగ్ కేంద్రంలో రీపోల్ అన్నది లేకుండా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులను కల్పించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్యను ఆదేశించారు.

విధుల నిర్వహణలో  అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని, పోలింగ్ కేంద్రాలలో సరైన వెలుతురు, ఇతర మౌలిక వసతులు ఉండాలన్నారు. ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటులో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరఫున ఎన్నికల విధులకు నియమించే ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీఏ, డీఏ లు సైతం చెల్లించడం జరుగుతుందని, అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి గ్రామపంచాయతీ ఎన్నికలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని పునరుద్ఘాటించారు.