calender_icon.png 31 August, 2025 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి

30-08-2025 05:52:37 PM

బి.ఆర్‌.ఎస్ యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ

అశ్వాపురం (విజయక్రాంతి): నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బిఆర్‌ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ డిమాండ్ చేశారు. అశ్వాపురం బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకపోగా, నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, రెండు సంవత్సరాలు దాటినా 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గత సంవత్సరం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కూడా కనిపించకపోవడం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. 

నిరుద్యోగ భృతి విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, ఇప్పటివరకు ఒక్క నిరుద్యోగికి కూడా భృతి అందలేదని రామకృష్ణ మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కులవృత్తుల అభివృద్ధి కోసం ప్రారంభించిన బి.సి బంధు పథకాన్ని నిలిపివేయడం, అలాగే దళితులకు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. రాజీవ్ యువ వికాసం పేరుతో ప్రారంభించిన పథకం కూడా దరఖాస్తుల దశలోనే ఆగిపోవడం, విద్యార్థులు, నిరుద్యోగ యువతతో ఎలాంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. హామీలు నెరవేర్చకపోతే, విద్యార్థి–నిరుద్యోగ యువత ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకోలేనిది అని గద్దల రామకృష్ణ హెచ్చరించారు.