17-11-2025 01:23:50 AM
-దట్టంగా అలుముకున్న పొగలు
-హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఘటన
ముషీరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేడియం వద్ద పార్క్ చేసి ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకుని, తీవ్ర కలకలం రేగింది.
ఎన్టీఆర్ స్టేడియం వద్ద పార్క్ చేసి ఉన్న ఎలక్ట్రిక్ కారులో నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే మంటలు వేగంగా వ్యాపించి, కారు పూర్తిగా కాలి బూడిదైంది. పక్కనే ఉన్న మరో కారుకు కూడా మంటలు అంటుకుని, అది పాక్షికంగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అదే సమయంలో, గాంధీనగర్, దోమలగూడ ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని, వాహనాల రాక పోకలను నియంత్రించి, ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, కారులో మంటలు చెలరేగడానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు వారు తెలిపారు.