19-08-2025 12:00:00 AM
తండ్రి, కొడుకు మృతి
సిద్దిపేట రూరల్, ఆగస్టు 18 : మొక్కజొన్న పంటసాగు రైతుల ప్రాణాలు తీసింది. తండ్రి, కొడుకుల మృతదేహాలను చూసిన వారు కంటతడిపెట్టారు. ఉన్న ఊరిని వదిలి, భూమి ఉన్న ఊరిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న యజమాని, అతని కుమారున్ని బలిగొన్న విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని గంగాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు. చంద్లపూర్ గ్రామానికి చెందిన మూర్తి గజేందర్ రెడ్డి (56) సమీప గ్రామంలోని గంగాపూర్ లో తన వ్యవసాయ భూమి ఉండడంతో అదే గ్రామంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.
సోమవారం తన కుమారుడు రాజేందర్ రెడ్డి (26) తో కలిసి వ్యవసాయ బావి వద్ద సాగుచేసిన మొక్కజొన్న పంటకు విద్యుత్ తీగలతో కంచ ఏర్పాటు చేస్తుండగా అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తీగ తగలడంతో షాక్ సంభవించింది. దాంతో తండ్రి, కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి వారిని బతికించే ప్రయత్నం చేయగా అప్పటికే ఇద్దరు తుది శ్వాస విడిచారు. మొక్కజొన్న పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు విద్యుత్ తీగల తో కంచె ఏర్పాటు చేసి రాత్రి సమయాల్లో కరెంట్ సరఫరా ఇస్తారు. కానీ కంచె ఏర్పాటు చేస్తుండగానే కరెంట్ షాక్ సంభవించడంతో రెండు ప్రాణాలు పోయాయి. గజేందర్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
ప్రమాదమని తెలిసి....
ఈ ప్రాంతంలో అనేక మంది రైతులు ఇదే పద్ధతిని కొనసాగిస్తారు. చాలా సందర్భాల్లో రైతులు ఇదే తరహాలో విద్యుత్ శాఖ సంబంధించి మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ కోతులు, అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు మరో మార్గం లేకపో లేదనేది రైతుల నమ్మకం. పంటల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక విధానాలను ఏర్పాటు చేస్తే రైతుల ప్రాణాలను కాపాడుకునే మార్గం అవుతుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.