calender_icon.png 4 November, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోర రోడ్డు ప్రమాదం... మోగిన మరణ మృదంగం

03-11-2025 07:49:12 PM

మాజీ మంత్రి సబితను అడ్డుకొని నిలదీసిన మృతుల కుటుంబ సభ్యులు

చేవెళ్ల బస్సు ప్రమాదం.. 

తాండూర్ ప్రాంతానికి చెందిన 13 మంది మృతి

తాండూర్ లో అంతులేని విషాదం

తాండూరు (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు, టిప్పర్ ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంతానికి చెందిన మృతుల వివరాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. మృతి చెందిన కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యాలాల మండలం పేర్కొంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ చాలా ఏళ్ల క్రితం తాండూరు పట్టణానికి వలస వచ్చారు. ఆయనకు నలుగురు కూతుళ్లు. ఒక కుమారుడు ఉన్నారు. పట్టణంలోని వడ్డెర గల్లిలో ఉంటూ ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తూ పిల్లలను అల్లారుముద్దుగా పెంచి పోషిస్తూ ఉన్నత చదువులు చదివిస్తున్నారు.

గత అక్టోబర్ మాసంలో  పెద్ద కూతురు అనూష వివాహము ఘనంగా జరిపించారు. రెండో కూతురు తనూష ఏంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తుంది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్లోని కోటి వుమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతురు నందిని అదే కాలేజీలో హై విజన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అక్క అనూష వివాహము కోసం వచ్చిన తనూష, సాయిప్రియ, నందినిలు సోమవారం పరీక్షలు ఉన్నాయని చెప్పి తాండూరు బస్టాంట్ నుంచి వెళ్లిన బస్సులో హైదరాబాద్ బయల్దేరారు. కుటుంబంతో కలిసి ఆనంద క్షణాలు గడిపిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకేసారి దుర్మరణం చెందారు. ఈ సంఘటనలో కుటుంబంలో ఆనంద క్షణాలు ఆవిరి అయ్యాయి. కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి

తల్లీ.. చిన్నారి

తాండూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన ఖాలీద్ వెల్డర్ గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు సలేహా(20)ను కొన్నేళ్ల క్రితం వాహిద్ తో వివాహాము జరిగింది. వాళ్లు హైదరాబాద్ లోని షహీన్ నగర్ లో ఉంటున్నారు. ఇటీవలే సలేహా కాన్పుకోసం వచ్చింది. తండ్రి ఖాలిద్ కూతురును అత్తారింట్లో వదిలేందుకని పసికందుతో కలిసి బయల్దేరారు. ప్రమాదంలో తల్లి సలేహాతో పాటు రెండు నెలల చిన్నారి దుర్మరణం చెందారు. తండ్రి ఖాలీద్ కూడా మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న రెండు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఉన్నత చదువుల కోసం వెళుతూ…

యాలాల మండలం లక్ష్మీ నారాయణపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, అలివేలుల కూతురు అఖిల రెడ్డి(20) హైదరాబాద్ లో ఏంబీఏ చదువుతోంది. సెలవుల్లో భాగంగా సొంతూరుకు వచ్చిన  ఆమె సోమవారం ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ బయల్దేరింది.  ప్రమాదంలో టిప్పర్ లో ఉన్న కంకర మీదపడి బస్సులోనే మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా విలపించారు. మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి సబితా రెడ్డిని ..గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా కూడా రోడ్లు వేయని మీరు ఎందుకు వచ్చారు అంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకొని నిలదీశారు.

కంకరలో కూరుకుపోయి.. తల్లడిల్లిన తల్లి మృతి

తాండూరు పట్టణం విశ్వంబర కాలనీకి చెందిన అబ్దుల్ మాజిద్ పట్టణంలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. సోమవారం మాజిద్ తన భార్య తబస్సుమ్ భేగం(35)తో పాటు ముగ్గురు పిల్లలతో కలిసి తాండూరులోని హైదరాబాద్ కు వెళుతున్నారు. ఆసుపత్రి పనిమీద కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. చేవేళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంకరలో కూరుకుపోయిన తల్లి తబస్సుమ్ తల్లడిల్లి తనువు చాలించింది. భర్త, పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనతో కుటుంబంలో విషాదం నిండింది.

తల్లిని చూసేందుకు వచ్చి..

కర్ణాటక రాష్ట్రం ముదేళ్లి సమీపంలోని బానూరు ప్రాంతానికి చెందిన నాగమణి(45) తాండూరులో ఉంటున్న తల్లి వద్దకు మూడు రోజుల క్రితం వచ్చింది. అనారోగ్యానికి గురైన తల్లిని పలకరించి.. మూడు రోజుల పాటు ఇక్కడే గడిపింది. అయితే హైదరాబాద్ లో ఉంటున్న పిల్లల వద్దకు వెళ్లేందుకు తాండూరు నుంచి ఆర్టీసీ బస్సులో బయల్దేరింది. చేవేళ్ల వద్ద జరిగిన ప్రమాదంలో నాగమణి కూడా దుర్మరణం పాలయ్యింది. దీంతో కుటుంబీకులు కన్నీరు.. మున్నీరుగా విలపించారు.

మొదటి బస్సు.. చివరి సర్వీసు..

తాండూరు నుంచి మొదటి సర్వీస్ గా ఉదయం 70 మంది ప్రయాణికులతో బస్సు బయల్దేరింది. బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామానికి చెందిన దస్తగిరి బాబా(45) అనే ఈ బస్సు డ్రైవర్ సుమారు 20 ఏండ్లుగా పాత తాండూరులో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో టిప్పర్, లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు. దాదాపు పదేళ్లుగా ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

సోమవారం నడిపిన ప్రైవేటు బస్సుకు పది రోజుల క్రితమే డ్రైవర్ గా చేరాడు. ప్రతి రోజూ ఇదే బస్సు హైదరాబాద్ కు మొదటి సర్వీసు బస్సుగా వెళుతోంది. సోమవారం  ట్రిప్పు వెళ్లిన బస్సు ప్రమాదానికి గురికావడంతో అతనికి చివరి ట్రిప్ అయ్యింది. గత రెండేళ్ల క్రితం వికారాబాద్ అనంతగిరి సమీపంలో ప్రైవేటు బస్సు నడుపుతుండగా బ్రేకులు ఫేయిల్ కావడంతో అప్పట్లో చాకచక్యంగా వ్యవహరించి అందరిని కాపాడారు. కాని సోమవారం జరిగిన ప్రమాదం నుంచి తప్పించలేకపోయి.. తానుకూడా చనిపోయాడు.

దవాఖాన కోసం వెళ్లి.. భార్య, భర్తల మృతి

యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందెప్ప, లక్ష్మీ భార్య భర్తలు కూడా బస్సు ప్రమాదానికి బలై పోయారు. లక్ష్మీకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రి  కి వెళ్లేందుకు బస్సులో హైదరాబాద్ కు బయల్దేరారు. బస్సు ప్రమాదంలో భార్య భర్తలు బందెప్ప, లక్ష్మీలు మృతిచెందారు. ఈవిషయం తెలుసుకున్న కుటుంభీకులు, వారి కూతుళ్లు భవాని, శివలీలు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తల్లిదండ్రుల మృతితో చిన్నారులు ఆనాథలుగా మారారు. ప్రభుత్వాలు మారినా... పాలకులు మారినా.. రోడ్లు విస్తరణ పనులు జరగకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.