calender_icon.png 24 September, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ స్టూడెంట్ మృతి

24-09-2025 01:01:29 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 23 :   హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఇంజినీరింగ్ విద్యార్థిని చనిపోయింది.  రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వెహికల్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందింది. హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాలు..  జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి  చెందిన ఖుర్షీద్ అహ్మద్ వాణి కుటుంబంతో హయత్‌నగర్ కృష్ణవేణి ఆస్పత్రి గల్లీలో నివాసముంటూ రామోజీ ఫిలింసిటీలో ప్రైవేటు  ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

ఆయన కుమార్తె  జమున అహ్మద్ (20)  గీతం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతోంది.  కృష్ణవేణి హాస్పిటల్ ఎదురుగా గీతం కాలేజీ బస్సు కోసం రోడ్డు దాటి వెళ్తుండగా.. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి ఎల్బీనగర్‌వైపు వెళ్తున్న గుర్తు తెలియని వెహికల్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన జమున అహ్మద్ స్పృహ కోల్పోయి రోడ్డు పక్కన పడిపోయింది. వెంటనే చుట్టుపక్కల వారు హాస్పిటల్‌కు తరలించగా.. పరిశీలించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు మార్గమధ్యలోనే యువతి చనిపోయినట్లు ప్రకటించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.