30-12-2024 12:00:00 AM
‘కీలు గుర్రం’ శీర్షికన కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, సుప్రసిద్ధ కవి డా.ఎన్.గోపి వెలువరించిన బాల గేయాలు పిల్లలను చక్కగా అలరింపజేస్తాయి. చిత్రకారుడు కూరెళ్ల శ్రీనివాస్ ఆసక్తికరమైన ముఖచిత్రం, అంతర చిత్రాలతో ‘పత్తిపాక ఫౌండేషన్ గరిపెల్లి ట్రస్ట్’ వారి ప్రచురణలో రూపొందిన ఈ సంపుటిలోని గేయాలను 1965 మధ్య కాలంలో రాసినవిగా ప్రకటించారు.
ఈ బాల గీతాలు సుమారు 60 ఏళ్ల కిందటివే అయినప్పటికీ చిట్టి పొట్టి మాటలు, సరళమైన భావాలతో ఏ కాలం పిల్లలకైనా చక్కగా, గొప్పగా పనికి వచ్చేవిగానే ఉన్నాయి. ముఖ్యంగా నిన్నటి, నేటి తరం బాలలు కోల్పోతున్న మమతానురాగాలు, అనుబంధాలను గుర్తు చేస్తూ, కుటుంబ విలువలను పెంపొందించే విధంగా గేయాలు అన్నీ ఉన్నాయి.
ఆనాటి ‘ప్రజామత’, ‘కృష్ణాపత్రిక’లలో ప్రచురితమైన బాల గేయాలను ఈతరం బాలలకోసం పుస్తక రూపంలో పునర్ముద్రించారు. డా.ఎన్.గోపి తన 15వ ఏట రాసిన ఈ గేయాలలో అక్షరమక్షరంలోనూ పసి హృదయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మొత్తం 13 గేయాలకు ఒక్కో దానికి ఒక్కో పూర్తి పేజీ సైజులో చిత్రాలు చూడచక్కగా సమకూరాయి.
బొమ్మగుర్రం, బూచి, బొజ్జ తాత, పొట్టి బావ, కర్మసాక్షి, రెక్కలుంటే, ఎవడే, బొమ్మలకే ప్రాణాలొస్తే, చిన్నారి చేష్టలు, యక్షప్రశ్నలు, ఎలుకమ్మ పెండ్లి, కీలుగుర్రం, చిన్నారి కోరిక శీర్షికలు పిల్లలను చదివింపజేస్తాయి. చిన్నచిన్న పదాలు పిల్లల నోళ్లలో నాట్యమాడేలా ఉన్నాయి.
‘అమ్మమ్మ దగ్గరికి బొమ్మ గుర్రము నెక్కి పోయి వస్తానమ్మ, పోయి వస్తాను’, ‘మామయ్య చెప్తాడు మంచికథలెన్నో, అత్తయ్య ఇస్తుంది ఆటబొమ్మలను’, ‘అన్నయ్య లాగ నను అనుకొంటివో యేమో, పిరికి మందును నాకు పోయెకే మాయమ్మ’, ‘దమ్ముంటే బూచాన్ని రమ్మనవె దబ్బున, చెప్తె నమ్మవు గాని చూపిస్త నా గొప్ప’, ‘తాత బొజ్జపై ఎగిరేవారు తప్పక అగుదురు రాజాలు’, ‘జేజేలండీ జేజేలు తాత కథలకు జేజేలు’, ‘అలుక బూనిన వేళ చూడాలి పాపను, అందాల జాబిల్లి సిగ్గు పడునప్పుడు’, ‘యక్షప్రశ్నల వంటి లక్ష ప్రశ్నలు వేసి తికమకలు పడుతుంటె పకపకా నవ్వుతుంది’, ‘రాత్రిళ్లు సూరీడు రాడేమి అంటుంది’, ‘ఎలుక పెండ్లిపిల్ల కులికి నాదమ్మా, అందచందాలను చిలికి నాడమ్మా’, ‘కీలుగ్రురముపైన గాలిలో పయనించి గగనాలు చేరాను’, ‘మురళి కొనిపెట్టనివచో ముద్దివ్వ నీకింక, నువ్వెన్ని చెప్పినా నేను విననే అమ్మ’.. ఇలా ఆనాటి బాల(గోపి) కవి ప్రయోగాలు చిన్నారులు పదే పదే చదువుకోదగ్గవిగా ఉండడమేకాక వారి హృదయాలను తప్పక హత్తుకుంటాయి.
కీలు గుర్రం, బాలగేయాలు,
రచన: డా.ఎన్.గోపి, ప్రతులకు: 9441701088, 9849649101
నిహిర