23-10-2025 07:33:23 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా పోలీస్ దోమకొండ ఎస్ఐ డి. స్రవంతి ఆధ్వర్యంలో “మాదకద్రవ్యాలు నివారణలో పోలీసుల పాత్ర – విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు” అనే అంశంపై ఎస్సే రైటింగ్ పోటీను ప్రభుత్వ జూనియర్ కళాశాల, దోమకొండలో గురువారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు మాదకద్రవ్యాల ప్రభావం, వాటి వల్ల కలిగే దుష్పరిణామాలు, అవగాహన పెంపొందించడంలో పోలీసుల సేవలు, సమాజంలో యువతకు వచ్చే ముప్పులు, వాటికి ఎదుర్కొనే మార్గాలపై వివరించారు. అనంతరం విద్యార్థులు మాదకద్రవ్యాల నుండి దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాజానికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత గురించి కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.