24-12-2025 01:08:19 AM
మాజీ ఎమ్మెల్యే హరిప్రియ
టేకులపల్లి, డిసెంబర్ 23, (విజయక్రాంతి):పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రాణహితంగా పోరాడి బీఆర్‌ఎస్ మద్దతుదారులు విజయం సాధించారని నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కొనియాడారు. మంగళవారం టేకులపల్లి మండలంలో బీఆర్‌ఎస్ బలపరిచిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆమె శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాస్వామ్య బద్ధంగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్ వైపే ఉన్నారని ఈ గెలుపు నిరూపించిందన్నారు. భారీ మెజారిటీతో గెలుపొందిన టేకులపల్లి, గోల్యాతండా, సులానగర్, బద్దుతండా, రామచంద్రుని పేట, బర్లగూడెం, సుకల్ బోడు, గొల్లపల్లి, రాంపురం సర్పంచ్లను అభినందించారు. అభివృద్దే మన -గులాబీ పార్టీ లక్ష్యం అని, మన గులాబీ పార్టీ అధినేత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు సూచించిన మార్గమని, పారదర్శకమైన పాలనను అందించి గ్రామాలను తీర్చిదిద్దాలని, ఎక్కడ కూడా బేదాభి ప్రాయాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా పరిపాలనను అందించాలని సూచించారు.
ప్రజలతో మమేకమై గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని, ప్రభుత్వంతో పోరాడి కొట్లాడి నిధులను తీసుకొచ్చి గ్రామపంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని సర్పంచులకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకి సూచించారు.స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన గోలియా తండా గ్రామపంచాయతీ మూడవ వార్డు మెంబర్ బానోతు నరేష్, సులానగర్ గ్రామపంచాయతీ ఐదవ వార్డ్ మెంబర్ బానోత్ సరళ, టేకులపల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ యూత్ ధారావత్ రమేష్ గులాబీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందని తెలిపారు.
పార్టీలోకి చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు భూక్య దల్ సింగ్ నాయక్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ లక్కినేని సురేంద్రరావు, టేకులపల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొమ్మెర్ల వరప్రసాద్, బోడ బాలు నాయక్, టేకులపల్లి మహిళా మండల అధ్యక్షురాలు ఆమెడ రేణుక, జిల్లా నాయకులు కిషన్ నాయక్, రామా నాయక్, బుర్రి వెంకటేష్, కోరం కుమార్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.