24-12-2025 01:10:48 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 23, (విజయక్రాంతి):జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ, డేటా మ్యాపింగ్ పనులను నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్ అన్నారు.మంగళవారం ఐడీఓసి కార్యాలయంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్తో కలిసి భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఐటీడీఏ పీవో రాహుల్, అన్ని మండలాల తహసీల్దార్లతో ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కె నాల్ భూసేకరణ, సీతమ్మసాగర్ ప్రాజెక్టు భూసేకరణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటరు జాబితాలో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలు, , బ్లర్ ఫోటోలు, ఇతర లోపాలను గుర్తించి నిబంధనల ప్రకారం సరిదిద్దాలని సూచించారు. ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల ని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) సమన్వయంతో పని చేసి ఖచ్చితమైన ఓటరు జాబితాను రూపొందించాలని ఆదేశించారు. ఎఈ ఆర్‌ఓలు తమ పరిధిలో పూర్తి బాధ్యత తీసుకుని, బీఎల్‌ఓలకు రోజువారీ లక్ష్యాలను నిర్ధేశించి మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పరిశీలన నిర్వహించి ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. వ్బుసైట్లో అందుబాటులో ఉన్న హౌస్ నంబర్, పేరు, ఈపిక్ నంబర్ సెర్చ్ ఆప్షన్లు డేటా మ్యాపింగ్ను సులభతరం చేస్తున్నాయని తెలిపారు.
అవసరమైన చోట్ల అదనపు సిబ్బంది, కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.రేపు అన్ని మండలాల్లో తహసీల్దారులు ఒకటి ఎక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రం, మరొకటి తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాన్ని ఎంపిక చేసి మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా స్థాయికి తెలియజేయాలని సూచించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్కు సంబంధించిన భూసేకరణను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని కలెక్టర్ తహసీల్దారులను ఆదేశించారు.
ఈ కెనాల్ కోసం అన్నపురెడ్డిపల్లి, బూర్గంపాడు, అశ్వాపురం, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, జూలూరుపాడు, కొత్తగూడెం, ములకలపల్లి, పాల్వంచ, సుజాతనగర్ మొత్తం 11 మండలాల్లో అవసరమైన భూసేకరణకు సంబంధించిన సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వేయర్లు ప్రతిరోజూ ఏ మండలాల్లో ఎంతవరకు సర్వే పూర్తయిందో పూర్తి వి వరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు మండలాల్లోని 30 గ్రామాల్లో భూసేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ, సీతమ్మసాగర్ ప్రాజెక్టు భూసేకరణ పనులను భద్రాచలం సబ్ కలెక్టర్ పర్యవేక్షించాలని సూచించారు. తహసీల్దార్లు తమ పరిధిలోని పీపీసీ కేంద్రాలు, రైస్ మిల్లులను నిరంతరం తనిఖీ చేయాలని ఆదే శించారు.
అంతరాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన అశ్వరావుపేట చెక్పోస్ట్ వద్ద ఇసుక, ధాన్యం అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘మన ఇసుక మన వాహనం’ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని తహసీల్దారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఎన్నికల సూపర్డెంట్ ధారా ప్రసాద్, భూసేకరణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.