14-05-2025 12:56:32 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
చివ్వేంల మే 13: చివ్వేంల మండలంలోని దురాజుపల్లిలో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్నేషనల్ స్కూల్ నందు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై ఉపాధ్యాయులకు జరుగుతున్న ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు నిబద్ధతతో పనిచేసి ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థానం చేరుకునేలా చూడాలని, సమాజంలోని అసమానతలు తొలగాలంటే విద్య ముఖ్య పాత్ర పోషిస్తుందని, అట్టి విద్యను అందించే ఉపాధ్యాయులపై గురుతరమైన బాధ్యత ఉందని కలెక్టర్ తెలియజేశారు.
వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రత్యేక బోధనపై ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు. విద్యా సంవత్సరానికి గాను ప్రత్యేక ప్రణాళికలు రచించి ఆగస్టు 15లోగా ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు వచ్చేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి మండల రిసోర్స్ పర్సన్స్, ఆంగ్లము, గణితము, సాంఘిక శాస్త్రానికి సంబంధించిన పాఠశాలల సహోఉపాధ్యాయులు, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కోఆర్డినేటర్లు జనార్దన్, పూలమ్మ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఆర్ పి రాంబాబు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.