24-11-2025 12:00:00 AM
-అనవసర ఖర్చులు చేయకుండ విజ్ఞతతో ఆలోచించాలి
-మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి,
-ఇందిరా మహిళా శక్తి సారే పంపిణీ కార్యక్రమం
-రాష్ట్ర ఆప్కారి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
వనపర్తి, నవంబర్ 23 (విజయక్రాంతి) : కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగ ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాకు సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు వీపనగండ్ల మండలంలో మంత్రి చేతుల మీదుగా చీరలు, లబ్ధిదారులకు కళ్యాణ లక్షీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా .. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికే కొన్ని అమలు చేయడం జరిగిందని, మిగిలిన వాటిని సైతం అమలు చేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటికైన మహిళలు విజ్ఞతతో ఆలోచించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పాటించడం, ప్రతి రోజు ఇంటిల్లిపాది కనీస వ్యాయామాలు చేయడం, అనవసర ఆర్భాటాలు, ఖర్చులు చేయకుండా విజ్ఞతతో ఆలోచించి కోటీశ్వరులు కావాలని మహిళలను సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ సరోజ, వీపనగండ్ల, చిన్నంబావి, పాన్గల్ మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మహిళా సమాఖ్య మండల అధ్యక్షులు, మహిళా సంఘాల సభ్యులు, మండల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు ఆర్థ్ధికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ నవంబర్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళలంతా ఆర్థికంగా ఎదగాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్, తెలకపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయాల్లో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి మహిళకు నాణ్యమైన చీరలు అందించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల చేనేత కార్మికులతో ప్రత్యేకంగా చీరలు తయారు చేయించారని తెలిపారు.
తెలంగాణలో కోటి మహిళలకు కోటి చీరలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9లోపు, పట్టణాల్లో మార్చి 8, 2026లోపు పంపిణీ పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చీరల తయారీలో స్థానిక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆధార్ కార్డు ఆధారంగా చీరలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు పాల్గొన్నారు.