calender_icon.png 7 May, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక అందరూ అంగన్‌వాడీ టీచర్లే

07-05-2025 12:32:40 AM

  1. 3,989మంది మినీ అంగన్‌వాడీ టీచర్లకు లబ్ధి
  2. ప్రమోషన్, వేతనం పెంపు
  3. రూ.13,650 వేతనం.. ఈనెల నుంచి అమల్లోకి
  4. ప్రతినెలా ప్రభుత్వంపై 2.35 కోట్ల అదనపు భారం

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరిస్తూ మినీ అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మంగళవారం ఉత్త ర్వులు జారీచేసింది.

దీంతో రాష్ట్రంలోని 3,989 మంది మినీ అంగన్ వాడీ టీచర్లు లబ్ధిపొందనున్నారు. ఇకనుంచి వీరు కూడా మెయిన్ అంగన్ వాడీ టీచర్ల మాదిరిగానే వేతనం అందుకోనున్నారు. ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంతో ఇకపై మినీ, మెయిన్ అంగన్‌వాడీ టీచర్లు అనే తేడా లేకుండా అందరూ అంగన్‌వాడీ టీచర్లుగానే కొనసాగుతారు. 

ఈనెల నుంచే అమల్లోకి..

చాలాకాలంగా పెండింగ్ ఉన్న మినీ అంగన్‌వాడీ టీచర్ల సమస్య ఎట్టకేలకు పరిష్కార మైంది. వాస్తవానికి సాంకేతిక సమస్యలు, న్యా యపరమైన చిక్కుల కారణంగా ఇంతకాలం ఆలస్యమైంది. అయితే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన ఉత్తర్వులు ఈనెల నుంచే అమల్లోకి రానున్నాయి.

ఈ నేపథ్యంలో మినీ అంగన్‌వాడీ టీచర్లకు కూడా మెయిన్ అంగన్‌వాడీ టీచర్ల మాదిరిగానే వేతనాలు అందుతాయి. గతంలో మినీ అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం నెల వేతనంగా రూ. 7,800 అందించేది. ఇక నుంచి క్రమం తప్పకుండా మెయిన్ అంగన్‌వాడీ టీచర్లతో సమానంగా నెలకు రూ.13,650 వేతనం అందించనున్నది. 

రూ.2.35 కోట్ల అదనపు భారం..

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,700 అంగన్‌వాడీ సెంటర్లున్నాయి. వాటిలో 35,700 మంది అంగన్‌వాడీ టీచర్లు పనిచేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లకు నెలవారీ జీతం కింద ఒక్కొక్కరికి రూ.13,650 చెల్లిస్తున్నది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మినీ అంగన్‌వాడీలకు కూడా 13,650 చెల్లించనున్నది. దీంతో 3,989 మంది మినీ అంగన్‌వాడీలకు అదనంగా ఒక్కొక్కరికీ రూ.5,850 చెల్లించాల్సి ఉంది.

మొత్తంగా 3,989 మందికి కలిపి గతంలో చెల్లించే దాని కంటే అదనంగా ప్రతినెలా రూ.2.35కోట్లను జీతాల కింది ప్రభుత్వం చెల్లించనున్నది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే ప్రతినెలా ప్రభుత్వంపై రూ.2.35 కోట్ల అదనపు భారం పడనున్నది.

అయినప్పటికీ ప్రభుత్వం చొరవ చూపి మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా ప్రమోట్ చేసినందుకు వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి చిక్కులు లేకుండా సమస్యను పరిష్కరించి, అంగన్‌వాడీ టీచర్ల మాదిరిగానే వేతనాలు అందిస్తున్న మంత్రి సీతక్కకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.