calender_icon.png 19 September, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలి

19-09-2025 12:00:00 AM

-గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

-హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): “ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలి. నిబంధనలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మన ప్రాణాలను కాపాడటానికే ఉన్నాయనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. సాంకేతికతతో పాటు సామాజిక స్పృహ పెరిగినప్పుడే సురక్షితమైన నగరాన్ని నిర్మించగలం” అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ట్రాఫిక్ సమ్మిట్ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు.

రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలతో సవాలు గా మారుతున్న హైదరాబాద్ నగర ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ఇందులో ప్రతి పౌరుడి క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఉద్ఘాటించారు. నిబంధనలను పాటించడంలో వ్యక్తిగత క్రమశిక్షణ, సామాజిక బాధ్య త పెరిగినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించి, భాగ్యనగరాన్ని ఒక సురక్షితమైన నగ రంగా తీర్చిదిద్దగలమని ఆయన పిలుపునిచ్చారు. 

ట్రాఫిక్ నిబంధనలు మన స్వేచ్ఛ ను హరించడానికి కాదు, మన ప్రాణాలకు రక్షణ కవచంగా పనిచేయడానికే ఉన్నాయని చెప్పారు.  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, హె సి ఎస్‌సి చైర్మన్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు, మహిళా భద్రత తర్వాత మొదటిసారిగా ట్రాఫిక్‌పై  హె సి ఎస్ సి ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ సదస్సును నిర్వహిస్తోందని తెలిపారు.

ట్రాఫిక్ అనేది ఒక నగరం యొక్క ముఖచిత్రం. 92 లక్షలకు పైగా వాహనాలు, రోజు కు 1500 కొత్త వాహనాల చేరికతో హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణ నగరం యొక్క కీర్తి ప్రతిష్టలకు కేంద్రంగా మారింది, అని ఆయన పేర్కొన్నారు. సదస్సులో హెసిఎస్‌సి ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి, ట్రాఫిక్ ఫోరం జాయింట్ సెక్రటరీ వి. రాజశేఖర్‌రెడ్డి, జాయింట్ సీపీ డి. జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు.