28-07-2025 12:09:17 AM
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట, జూలై 27 (విజయక్రాంతి) : మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జనగాం క్రాస్ రోడ్ వద్ద గల ఓ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన కబడ్డీ క్రీడాకారుల భవిష్యత్తు కార్యాచరణ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
గ్రామీణ క్రీడ అయిన కబడ్డీలో రాణించి ఎంతోమంది క్రీడాకారులు ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ రంగాలలో స్థిరపడ్డారని అదేవిధంగా ప్రస్తుతం కనుమరుగవుతున్న ఈ కబడ్డీ క్రీడను అసోసియేషన్ సభ్యులంతా గ్రామీణ క్రీడాకారులను వెలికి తీసి ఉన్నత స్థాయిలో ఉంచాలన్నారు. దానికి తాను అన్ని విధాల సహకరిస్తారని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ లో నెలకొన్న సమస్యల గురించి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. అందుకు తాను వ్యక్తిగతంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.
కబడ్డీ క్రీడాకారులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వారికి తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాననీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ క్రీడాకారులు రామచందర్ గౌడ్, రామసాని రమేష్ నాయుడు, గాజుల యాదగిరి, వెంకట రమణాచారి, గుడిపాటి సైదులు, లాల్ మాజార్, రవీందర్ రెడ్డి, నాగిరెడ్డి, ఇమామ్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.