16-08-2025 09:11:15 PM
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..
సూర్యాపేట (విజయక్రాంతి): కాలేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ చెబుతున్నదంతా అబద్ధాలేనని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా.. కాలేశ్వరం లేదని చెప్పడం అంటే కేవలం బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పక్కకు పెట్టి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ ను వినిపిస్తున్నాడన్నారు. కాలేశ్వరంపై ఉన్న నంది మేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్ లను ప్రారంభించినారంటే కాలేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లేనన్నారు.
కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనక చర్లను వ్యతిరేకించి తీరాలన్నారు. గోదావరిపై ఇంకో ట్రిబ్యునల్ వచ్చిన తర్వాతనే ఏపీ ప్రాజెక్టులకు అనుమతించాలన్నారు. ఇప్పుడున్న నీళ్ల మీద ప్రాజెక్టు కట్టడానికి వీలు లేకుండా అడ్డుకోవాలన్నారు. గోదారిలో మనకిచ్చిన హక్కుల ప్రకారమే మనం కాలేశ్వరం నీళ్లు వాడుతున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్ తో పాటు సరిపడా నీళ్ళు అందించి ఆదుకోవాలని అన్నారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.