01-01-2026 11:43:28 PM
10న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
అనంతరం రిజర్వేషన్ల కసరత్తు
చైర్ పర్సన్‌తోపాటు వార్డుల రిజర్వేషన్ల ఖరారు విధానంపై ఆశావహుల ఆరా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గణనతో తేలనున్న రిజర్వేషన్లు
ఆర్మూర్, జనవరి 1 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కావడంతో పోటీకి సై అంటున్న ఆశావహుల్లో వార్డుల రిజర్వేషన్ ఏమవుతుందో నన్న ఉత్కంఠత కొనసాగుతోంది. గతంలో ఏ వార్డు ఏ కేటగిరికీ రిజర్వు అయింది. ఇప్పుడు ఏ కేటగిరీకి రిజర్వు అవుతుంది అని చర్చించుకుంటూ ఎవరి అంచనాల్లో వారు మునిగిపోయారు. మరోవైపు మున్సిపాలిటీల పరిధిలో వార్డుల పునర్విభజన పూర్తి అయినప్పటికీ మహిళలు, పురుషులు, ఇతర ఓటర్లతో పాటు సామాజిక వర్గాల వారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్ల లెక్కింపుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేవు. కాని సామాజిక వర్గాల వారిగా లెక్కింపు ప్రక్రియను సైతం త్వరలో పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు అనధికారికంగా పేర్కొంటున్నారు.
జిల్లాలో నిజామాబాద్ కార్పోరేషన్తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ ఓటర్ల గణన నిర్వహించాల్సి ఉంది. ఈ గణన పూర్తయిన తర్వాతనే వార్డుల వారిగా రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే వార్డుల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసి చైర్ పర్సన్ రేసులో ఉండాలనుకుంటున్న ఆశావహులు తమ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఏ కేటగిరీకి రిజర్వు అవుతుందోనని ఆరాలు తీస్తున్నారు. నిజామాబాద్ కార్పోరేషన్ పరిధిలో 60 డివిజన్లు, ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు, బోధన్ మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు, భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డుల్లో ఈ నెల 10వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. తదనంతరం రిజర్వేషన్ల కసరత్తు ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ప్రధాన పార్టీల్లో పోటీ..
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం అవుతుండటంతో వార్డుల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయడానికి ఆశావహుల మధ్య పోటీ పెరిగిపోయింది. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఈ తాకిడి కాస్త ఎక్కువగానే ఉంది. మరో వైపు బీఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు సైతం కొన్ని వార్డుల్లో ఒకరికంటే ఎక్కువ మంది పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో ఆయా పార్టీల ముఖ్య నాయకులకు టికెట్ల కేటాయింపు తలనొప్పి కానుందనే చర్చ సైతం జరుగుతోంది. రిజర్వేషన్ల కేటాయింపుపై స్పష్టత రాకపోవడంతో ఆశావహులు గత ఎన్నికల్లో వచ్చిన రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం వచ్చే రిజర్వేషన్లను అంచనా వేసే పనిలో ఉన్నారు. మరో పక్షం రోజుల్లో రిజర్వేషన్ల ఉత్కంఠకు తెర పడనుంది.