20-07-2024 01:04:35 AM
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ కమ్మగూడ ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ నిర్మాణంపై వివరణ ఇవ్వాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో పాటు తహసీల్దార్, డీఈవో, ఎండీవోకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను న్యాయస్థానం ఆదేశించింది. పాఠశాల స్థలానికి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి భూ ఆక్రమణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పాఠశాల ప్రిన్సిపాల్ బీ దేశు జూన్ 5న లేఖ రాశారు. ‘అన్ని డాక్యుమెంట్లు ఉన్న పాఠశాలకు చెందిన 175 చదరపు గజాల భూమి తమకు రహదారి ఉందని కమ్మగూడ న్యూసుభాశ్‌నగర్ వేల్ఫేర్ అసోసియేషన్ ఆరోపిస్తున్నారు. పాఠశాల స్థలం మధ్య నుంచి కచ్చా రోడ్డును ఏర్పాటుచేయటంతో పిల్లలకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సివస్తోంది’అని పేర్కొన్నా రు. ఈ లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి నోటీసులు ఇచ్చింది.