22-10-2025 06:09:16 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మండలంలోని చిరకుంట గ్రామంలో అరిగెల లక్ష్మయ్య 33వ వర్ధంతి సందర్భంగా బుధవారం వారి కుమారులు అరిగెల నాగేశ్వరావు, మల్లికార్జున్, వేణుల ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ముందుగా వారి కుమారులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన వైద్యులచే రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను అందించారు.
ఈ వైద్య శిబిరంలో 100కు పైగా రోగులకు వైద్య పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు మాట్లాడుతూ మాతండ్రి గారైన లక్ష్మయ్య జ్ఞాపకార్ధం ఆయన వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు ఉచిత వైద్యంతో పాటు మందులను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు సుంకరి పెంటయ్య, నాయకులు గాజుల రాజేంద్రప్రసాద్, మేకర్తి లచ్చన్న, శరత్, దీపక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.