calender_icon.png 4 July, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌలు వేలం.. రద్దుతో రైతులు గందరగోళం

03-07-2025 01:34:30 AM

-దేవాలయ భూముల కౌలుకు అధికారులు వేలం                

-103 ఎకరాలకు రూ.5 లక్షలకు నిర్ణయం                 

-ఉన్నతాధికారుల ఆదేశాలంటూ కౌలు రద్దు చేస్తున్న వైనం.   

-అయోమయంలో అన్నదాత ఆగమాగం

నూతనకల్, జూలై 2 : దేవాలయ భూములకు బహిరంగ ప్రకటన చేసి అధికారులు కౌలు వేలం నిర్ణయించారు. దానిని దక్కించుకున్న రైతు అందులో సాగు అయ్యే భూమిలో ఇప్పటికే పత్తి విత్తనాలు విత్తగా మిగిలిన బీడు భూములను జీవాల మేతకు వాటి పెంపకందారులకు ఇచ్చాడు. అయితే ఇప్పుడు కౌలు తగ్గిందనే కారణంతో దాన్ని రద్దు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రద్దు చేస్తామని దేవాదాయ శాఖ అధికారులు చెప్పడంతో కౌలుకు తీసుకున్న  రైతు లబోదిబోమంటున్నాడు.

వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి పేరున ఉన్న సుమారు 103 ఎకరాల దేవాలయ భూములకు గత ఏప్రిల్ నాలుగవ తేదీన అధికారుల సమక్షంలో వేలం నిర్వహించారు. అదే గ్రామానికి చెందిన దరిపల్లి వెంకన్న రూ.5 లక్షలకు వేలం దక్కించుకున్నాడు. తదుపరి ఆ డబ్బులను ఎండోమెంట్ అధికారులకు చెల్లించారు. అనంతరం శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్వామి దయతో వేలం దక్కిందన్న ఆనందంలో కళ్యాణ మెత్సవం, అన్నదాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.       

 సాగు కొంత.. బీడుకొంత.. : దేవుని మాన్యంలో కొంత భూమి సాగుకు అనుకూలంగా ఉండగా మరికొంత భూమి బీడుగా ఉంది. బీడు భూమిని జీవాల మేతకు, సాగు భూమిలో కొంత భూమిని వెంకన్న తన ఆధీనంలో ఉంచుకొని మిగతా భూమిని అదే గ్రామానికి చెందిన కొంతమంది రైతులకు కౌలుకి ఇచ్చుకున్నాడు. సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో రైతులు ఇప్పటికే పత్తి పంటను సాగు చేశారు. పత్తి గింజలు మొలకెత్తగా ఇప్పటికే లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు మొలసిన మొక్కను చంటి పిల్లలా కాపాడుకుంటున్నారు.

మాట మార్చిన అధికారులు..: అంతా సజావుగా సాగుతుందనుకున్నా సమయంలో అధికారులు మాట మార్చడంతో రైతుల గుండెల్లో బాంబు పేలినంత పనైంది. జిల్లా కలెక్టర్ దేవాలయ భూముల కౌలు వేలం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నాడు అని చెప్పడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఏమైనా పొరపాట్లు ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి కానీ తమకు అన్యాయం చేయటం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేనైనా స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే ఇదే విషయమై ఎండోమెంట్ అధికారి కుశలయ్యను వివరణ కోరగా గతంలో రూ.9 లక్షల కౌలు రాగా ప్రస్తుతం రూ.5 లక్షలు మాత్రమే వచ్చినందున కలెక్టర్ ఆదేశాల మేరకు రద్దుచేసి తిరిగి కౌలుకు వేలంను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

 ఈనెల 4న కౌలు వేలంపాటకు సమాయత్తం : 

ఈనెల 4న దేవాలయ భూములకు మరోసారి వేలంపాట నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గ్రామస్తులను భూముల కౌ లు వేలానికి సహకరించాలనితహసిల్దార్ శ్రీనివాసరావు, పలువురు రెవిన్యూ, ఎండోమెంట్, పోలీస్ శాఖ అధికారులు కోరినట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. 

 నిబంధనల మేరకే కౌలు వేలం తీసుకున్నాను 

ఎండోమెంట్ అధికారులు సూచించిన నిబంధనల మేరకే దేవాలయ భూముల కౌలు వేలంలో పాల్గొని రూ.5 లక్షలకు దక్కించుకున్న. వేలం డబ్బులు చెల్లించి కొంత భూమిని ఉంచుకొని మరికొంత భూమిని కొంతమంది రైతులకు ఇచ్చా. బీడు భూమిని యాదవులకు జీవాల మేతకు ఇచ్చాను. వారందరూ నాకు డబ్బులు ఇచ్చారు.ఇప్పుడు వేలం రద్దు అయిందని అధికారులు చెబుతూ ఉండడంతో కౌలుకి తీసుకున్న రైతులు మాఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు. బహిరంగ ప్రకటన ద్వారా గత ఏప్రిల్ 4న వేలంపాట నిర్వహించి భూమిని అప్పచెప్పిన తర్వాత అధికారులు తిరిగి అది సరికాదు.. మళ్లీ వేలంపాట నిర్వహిస్తాననడం ఎంతవరకు సమంజసం. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు నాలాంటి రైతుల పరిస్థితిని దష్టిలో ఉంచుకొని ఆ భూములను మాకే అప్పగించాలని వేడుకుంటున్న.

 దరిపెల్లి వెంకన్న, కౌలుకు తీసుకున్న రైతు