12-07-2025 06:34:04 PM
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలం(Doultabad Mandal) హైమద్ నగర్ లో యూరియా కోసం రైతులు బార్లు తీరారు. శనివారం పిఎసిఎస్ ఆధ్వర్యంలో 560 యూరియా బస్తాలు రాగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో యూరియా ఇవ్వడానికి సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఒక రైతుకు రెండు బస్తాలు ఇవ్వడంతో తమకు ఎలా చాలుతుందని రైతులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు.
గతంలో ఎప్పుడూ యూరియా కొరత లేదని ప్రస్తుతం యూరియా కొరత వలన తాము పనులు వదులుకొని రెండు బస్తాల యూరియా కోసం ప్రొద్దున నుండి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలామందికి అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ వెనుతిరిగి వెళ్లారు. అలాగే దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ సెంటర్ కు 500 యూరియా బస్తాలు రావడంతో క్యూలైన్ ద్వారా నిలబడి రైతులు బస్తాలను తీసుకున్నారు. యూరియాను అందుబాటులో ఉంచాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. శనివారం మండలానికి పిఎసిఎస్, అగ్రోస్ సెంటర్లకు 1060 బస్తాల యూరియా వచ్చిందని వాటిని రైతులకు అందజేయడం జరిగిందని వ్యవసాయ అధికారి సాయికిరణ్ తెలిపారు.