29-10-2025 12:10:56 AM
మెదక్, అక్టోబర్ 28 (విజయక్రాంతి):రానున్న మూడు రోజులు తుఫాను ప్రభావం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డిఓ మహిపాల్ రెడ్డి, డిఎస్‌ఓ నిత్యానంద్, డిఎంసిఎస్ జగదీష్, తహసిల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పకడ్బంధీ టీం వర్కుతో రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కొనుగోలు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో తుఫాను ప్రభావంతో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తుఫాను తీవ్రత తగ్గేవరకు. కోతలు వాయిదా వేయడం వల్ల ధాన్యం పాడవకుండా ఉంటుందని, కోతలు కోయకుండా ఉంటే పంట త్వరగా ఆరడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 8,442 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, మరింత వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.