29-10-2025 12:11:15 AM
బాన్సువాడ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ప్రభుత్వం మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు తాత్సారం చేస్తుండటంతో ఇదే అనువుగా దళారులు తమ ఇష్టానుసారంగా ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. మొక్కజొన్న నిల్వ చేసుకునే అవకాశం లేని రైతులు మధ్య దళారి వ్యాపారులు అడిగిన ధరకు కట్టబెడుతున్నారు.
ఓవైపు వరణుడి రేటు.. మరోవైపు పాలకుల రూటు... వెరసి అన్నదాతలు ఆగమవుతున్నారు. మొక్కజొన్న పంటలు దిగుబడులు అంది అమ్ముకునే సమయంలో భారీ వర్షాలు వాతపెట్టాయి. పంట తడిచి రంగు మారడంతో రైతులకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వ్యాప్తంగా మొక్కజొన్న సాగు చేసిన రైతులందరికీ ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
దళారులు సాకులు
ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, క్వింటాలు రూ.2,800 వరకు గిట్టుబాటు ధరను అందిస్తామని హామీ ఇచ్చింది. మొక్కజొన్న దిగుబడులు వచ్చిన సమయంలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేస్తే రైతులకు ఇలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉండేది కాదు. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు వానల సాకులు చూపి పంట దిగుబడులు బాగోలేదన్న అంశాన్ని తెరపైకి తెస్తూ అడ్డగోలుగా కొనుగోలు చేస్తున్నారు.
క్వింటాలుకు రూ.2,400 వరకు రావల్సి ఉండగా.. కేవలం రూ.1,200 నుంచి రూ.1,600 లకే దళారులు కొంటున్నారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ. వెయ్యి నుంచి రూ.1,200 నష్టం వాటిల్లుతోంది. ఎకరాకు 30 క్వింటాళ్ల మొక్కజొన్న పంట దిగుబడి వస్తే, దళారులకు అమ్మితే ఎకరానికి సుమారు రూ.30 వేల నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, క్వింటాలుకు రూ.2800 గిట్టుబాటు ధరను జిల్లాలోని రైతులు, బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.