calender_icon.png 24 October, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కపాస్ కిసాన్ యాప్‌పై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి

24-10-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట.అక్టోబర్,23(విజయక్రాంతి): పత్తి కొనుగోళ్ల కు సంబంధించింది సీసీఐ కొత్తగా ప్రవేశ పెట్టిన కపాస్ కిసాన్ మొబైల్ యాప్ పై  గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు జిల్లా రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. సిసిఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాలు, పత్తి సేకరణ తదితర అంశాలపై గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి ఆమె రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు.

కపాస్ కిసాన్ మొబైల్ యాప్ తో పత్తి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, ఆ యాప్ గురించి రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే బాధ్యత మండల స్థాయి అధికారులదే అన్నారు. ఈ నెల 24 న జిల్లాలోని అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు కపాస్ కిసాన్ యాప్ గురించి రైతులకు తెలియ జేసి, ఆ యాప్ ఉపయోగించి పత్తి విక్రయం ఎలా చేసుకోవాలో రైతులకు క్లుప్తంగా వివరించి చెప్పాలన్నారు. అలాగే మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎంపీడీఓ లు యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించేందుకు స్లాట్ బుకింగ్ పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

జిల్లాలో రైతులు పండించిన పత్తిని కనీస మద్దతు ధర చెల్లించి 7 పత్తి కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు తమ ఫోన్ లో కపాస్ కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే సమయంలో రైతులు ఇచ్చిన ఫోన్ నెంబర్లు ప్రస్తుతం మారితే అప్డేట్ చేసుకునేలా ఏఈఓ లు సహకరించాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో మొత్తం 7 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

సిసిఐ ఆదేశాల ప్రకారం రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించేలా తేమ శాతంపై సంబంధిత వ్యవసాయ అధికారులు అవగాహన కలిగించాలన్నారు. జిల్లాలో 21,21,984 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీను, సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, జిల్లా మార్కెటింగ్ అధికారిని బాలామణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, మార్కెట్ కార్యదర్శి భారతిపాల్గొన్నారు.