19-09-2025 12:00:00 AM
-ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా
-వాగులో ఇసుక ట్రాక్టర్ల జాతర
మరిపెడ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక రవాణా పేరుతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్న గూడూరు మండలాల శివారులోని ఆకేరు వాగులో రోజుకు వందల ట్రిప్పుల ఇసుకను అక్రమంగా తోడేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆయా మండలాల పరిధిలోని బావోజి గూడెం, వెంకంపాడు, చింతల గడ్డ తండా, తాళ్ళ ఉకల్, తానంచర్ల, అజ్మీర తండా రోడ్లలో రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్లు సుమారు నడుస్తున్నాయి.
ఆకేరు వాగు నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో ఇతరులకు అధిక ధరలకు అక్రమంగా విక్రయిస్తూ ఇసుక దందా నిర్వహిస్తున్న దళారులు సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అక్రమ ఇసుక దందా వ్యవహారం రోజురోజుకు పెరుగుతూ పోతుంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయిస్తే కొందరు ట్రాక్టర్ల యజమానులు సిండికేట్ గా మారి ఇసుక అక్రమ రవాణా దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక పంపిణీకి ముందు, వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ఎవరైనా ఫిర్యాదు చేయగానే పోలీసు, రెవిన్యూ యంత్రాంగం అందరూ కలిసి ఎక్కడెక్కడ డంపింగ్లు ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరిగేది.
అలాగే వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేయకుండా పలుచోట్ల ప్రత్యేకంగా పోలీసులు రెవెన్యూ అధికారులు జెసిబి లతో కందకాలు తీసి ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేవారు. అయితే ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి మరిపెడ మండలంలో అధికార యంత్రాంగం సైతం ఇసుక రవాణాపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇసుక రవాణా చేసుకోవాలంటే అధికారుల అనుమతి చెబుతున్నారు. కొన్ని రోజుల నుంచి మరిపెడ మండలంలో ఎవరి ఆధీనంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా నడుస్తున్నదని చర్చ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ సొమ్ము దళారుల పాలు
ఇసుక తరలింపు పై అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పటికీ, ఇతర ప్రభుత్వ ప్రైవేటు, వాణిజ్య నిర్మాణాలకు ఇసుక ఎక్కడి నుంచి వస్తున్నదనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఇతర నిర్మాణాలకు కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి వాగు నుండి ఇసుక తరలించాల్సి ఉంటుందని, అయితే ఎక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకున్న దాఖలను లేవని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతుందని విమర్శలు వస్తున్నాయి.
నెంబర్ ప్లేట్లు లేనీ ట్రాక్టర్లలో తరలిస్తున్న ఇసుక
నెంబర్లు ప్లేట్లు లేని వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక వ్యాపారం లాభసాటిగా మారడంతో పగలు రాత్రి తేడా లేకుండా మండల సరిహద్దు దాటుకొని రోజుకు వందల సంఖ్యలో ఇసుక వాహనాలు వెళుతున్నాయి. ఇసుకను తరలిస్తున్న వాహనాలను ఎక్కువగా మైనర్లే నడుపుతున్నారు. ఇసుక వాహనాలను డ్రైవర్లు అతివేగంగా నడపడం వల్ల ఇతర వాహనదారులు పలు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓవర్ స్పీడ్ తో వస్తున్న ఇసుక వాహనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాహనాలను మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న పట్టించుకునే నాధుడే లేడని పలు గ్రామాలు ప్రజలు వాపోతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు తనిఖీ చేసి ఇసుక వాహనాలను స్వాధీనం చేసుకుని, నామమాత్రపు జరి నామాలు విధిస్తూ వదిలేస్తున్నారని, పలు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. నిత్యం వందలాది ట్రాక్టర్లు రోడ్లపై తిరుగుతూ ఉండడం వల్ల రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతింటున్నాయని, దీనితో సభకు ఇబ్బందిగా మారిందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలు గ్రామ ప్రజలు కోరుతున్నారు.
దళారులు నిర్దేశించిందే ధర
ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కూపన్లు ఇస్తుండగా ట్రాక్టర్ల యజమానులు కేవలం రవాణా చార్జీ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రాక్టర్ రవాణా చార్జీలను ఎక్కడ కూడా అధికారులు నిర్ణయించలేదు. దీనితో ట్రాక్టర్ల యజమానులు నిర్ణయించిన ధరకే నిరుపేదలు ఇసుక దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ఇసుక కూపన్లు ఇచ్చే ముందే ఎక్కడి నుంచి ఎక్కడికు ఇసుక తరలిస్తున్నారు తెలుసుకొని అందుకు తగ్గట్టుగా ధర కూడా నిర్ణయించి అంతే ధర లబ్ధిదారుల నుండి ట్రాక్టర్ల యజమానులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిబంధనల ప్రకారమే ఇసుక కేటాయింపు
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే ట్రాక్టర్లకు ఇసుక కూపన్లు ఇస్తున్నాం. ఇసుక అక్రమ రవాణా విషయంలో ఫిర్యాదు రాగానే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు వాహనాలను స్వాధీనం చేసుకుని జరిమానా కూడా విధించాం. ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
- ఎస్.సంపత్ కుమార్, తహసిల్దార్, చిన్న గూడూరు