06-11-2025 12:56:48 AM
-టీఎస్ టీసీఈఎ రాష్ట్ర అధ్యక్షుడు ఆయినేని సంతోష్ కుమార్ డిమాండ్
-అమరవీరుల స్థూపం ఎదుట పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన అధ్యాపకులు
ముషీరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి) : పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్కూల్స్, టెక్నీకల్ ఎంప్లాయిస్ అసోసియేషన్(టీఎస్ టీసీఈఎ) అధ్యక్షుడు ఆయనేని సంతోష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని అధ్యాపకులతో కలిసికట్టుగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్బంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, ఫార్మ సీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు 2 నుంచి 6 నెలల జీతాలు లేక మానసికంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతి సంవత్సరం విడుదల చేయాలని ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గత 3 ఏళ్లుగా విడుదల చేయడం లేదని, ప్రస్తుతం రూ.8500 కోట్ల ఫీజు పెండింగ్ లో ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్థామని హెచ్చరించారు. ప్రతి మూడు నెలలకి ఒక్క సారి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. అధ్యాపకులకు ఏఐసిటిఈ నిబంధనల ప్రకారంగా 7వ వేతన సంఘ జీతాలను ప్రతి నెల ఎడ్యుకేషన్ ఆక్ట్ 1982 ప్రకారంగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రూప్ ఆక్సిడెంట్ పాలసీ ఉండాలని ఉన్న కాలేజీలు అమలు చేయడం లేదని, దీంతో అధ్యాపకులకు జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులవుతారని ప్రశ్నించారు.
ఎవరు న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. కావున ప్రతి ఒక్కరికీ గ్రూప్ ఆక్సిడెంట్ పాలసీ అమలు చేయాలన్నారు. పబ్లిక్ సెలవు దినాలలో కూడా కాలేజ్‌ల నిర్వహణ చేపట్టి అధ్యాపకులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మండి పడ్డారు. యూనివర్సిటీ నిబంధనల ప్రకారంగా రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు దినాలు ఉన్న పాటించడం లేదన్నారు.
పబ్లిక్ సెలవు దినాలను సెలవు దినాలుగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో టీఎస్ టీసీఈఎ నాయకులు డి.శ్రీనివాస్, బి.అనంత రామ్, కె.రాజు, సందీప్, సంజయ్, ఉపేందర్, దేవ్ సింగ్, వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.