19-09-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.
రేగొండ, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): అభివృద్ధి పనులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా నివేదికలు పంపించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో పంచాయతీరాజ్, విద్య మహిళా సంక్షేమ, డిఆర్డిఓ, గిరిజన, టీజీ డబ్ల్యూ ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరికీ విద్య, సౌకర్యాలు అందించి విద్యార్థులకు అనువైన వాతావరణం కల్పించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలకు ప్రాధాన్యతనిస్తూ మరమ్మత్తులు చేపట్టాలని అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్, మంచినీరు, మరుగుదొడ్డి సౌకర్యాలు ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిఈఓ రాజేందర్, మహిళ సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డిఆర్డిఓ బాలకృష్ణ, డిపిఓ శ్రీలత, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ రామకృష్ణ, పిఆర్ డిఈ లు సాయిలు, రవికుమార్, టీజీ డబ్ల్యూ ఐడిఓసి డి ఈ జీవన్ తదితరులు పాల్గొన్నారు.