26-07-2024 12:44:46 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ ఉన్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ హైదరాబాద్‌ను అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణం చేపడుతుంది. అందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,525 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక అంచనాల ప్రకారం ఉత్తర ప్రాంతానికి రూ.13,522 కోట్లు, దక్షిణ ప్రాంతానికి రూ.12,980 కోట్ల ఖర్చవుతుంది. మొదటి దశలో భాగంగా రూ.1,525 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
ఈ నిధులతో ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ చేయనున్నారు. హైదరాబాద్‌కు ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ 189 కి.మీ. పొడవున ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ముందుగా 4 లేన్లు, ఆ తర్వాత 8 లేన్ల రహదారిగా నిర్మించి జాతీయ రహదారుల జాబితాలో చేర్చడానికి వీలుగా ఉండేలా చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు అభివృద్ధి కానున్నాయి.