26-07-2024 12:38:13 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో మూసీ సుందరీకరణ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా ప్రభుత్వం భావిస్తున్నది. లండన్‌లోని థేమ్స్ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టుగా మూసీని తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో మూసీ సుందరీకరణకు బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు కేటాయించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మూసీ పరివాహక ప్రాంతానికి పూర్వ వైభవం తేనున్నట్లు ప్రకటించింది.
నదీ తీర ప్రాంతంలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతం వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా 55 కిలోమీటర్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కి.మీ. పట్టణ ప్రాంతం పునరుజ్జీవనం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రాజెక్టులో భాగంగా రిక్రియేషన్ జోన్‌లు, పాదచారుల జోన్‌లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లను అభివృద్ధి చేయనున్నారు. మూసీపై ఇప్పటికే డిజిటల్ సర్వే పూర్తి కాగా, ప్రస్తుతం 33 రెవెన్యూ అధికారుల బృందాలు సరిహద్దులు తేల్చేందుకు సర్వే చేపడుతున్నారు.