calender_icon.png 22 November, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి రూ.3,065 కోట్లు

26-07-2024 12:36:43 AM

గతేడాది బల్దియాకు సున్నా నిధులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అత్యంత కీలకమైంది. జీహెచ్‌ఎంసీ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు కావాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. ప్రభుత్వం గురువారం ప్రకటించిన బడ్జెట్‌లో రూ.3,065 కోట్లను జీహెచ్ ఎంసీకి కేటాయించింది. ప్రస్తుతం కేటాయించిన ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసినా బల్దియాలో చాలా అభివృద్ధి పనులు చేపట్టవచ్చు. కాగా జీహెచ్‌ఎంసీకి గతేడాది బీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదు.

2023 డిసెంబరులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2024 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.1,100 కోట్లను ప్రతిపాదించారు. ఇందులో ఒక్క పైసా కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో జీహెచ్‌ఎంసీకి ఇప్పటికే ఉన్న రూ.7 వేల కోట్ల అప్పులు, వాటికి చెల్లించాల్సిన వడ్డీ బల్దియాకు భారంగా మారుతుంది. ఫిబ్రవరిలో కేటాయించిన ఓట్ ఆన్ అకౌంట్ మాదిరిగానే.. ఈ బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించి, నిధులు విడుదల కాకుండా ఉంటాయా అనే సందేహం జీహెచ్‌ఎంసీ అధికారుల్లో నెలకొంది. ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీకి వివిధ రూపాల్లో దాదాపు రూ.3,800 కోట్ల దాకా రావాల్సి ఉంది.