06-08-2025 12:30:31 AM
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, ఆగస్టు 5(విజయక్రాంతి): జిల్లాలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నాలుగు రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు మొదటి రోజులో భాగంగా మంగళవారం కలెక్టర్ జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా వివిధ వార్డులను సందర్శిస్తూ పాత టైర్లు, గోళాలు, నీరు నిల్వ ఉండు వాటిని పరిశీలించి దగ్గరుండి పారబోయించారు. మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో తప్పనిసరిగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయతీలోని పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఎస్‌ఎస్జి మెంబర్లు, మల్టీపర్పస్ వర్కర్లు ఒక టీంగా ఏర్పడి ప్రతి ఇంటిని సందర్శించి ఆ ఇంటిలోని పరిసరాలను పరిశీలించాలని చెప్పారు.
ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా గ్రామాలను సందర్శించి లార్వా లేకుండా అన్ని ఇండ్లు ఉండే విధంగా చూడాలన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని, అన్ని పాఠశాలల్లో విద్యార్థులు సబ్బుతో చేతులు కడుక్కునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.