calender_icon.png 29 October, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగి వెహికల్ నడిపితే రూ.10 వేల ఫైన్

28-10-2025 06:46:28 PM

రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా, జైలు శిక్ష

హుస్నాబాద్ ఏసీపీ సదానందం హెచ్చరిక

హుస్నాబాద్: మద్యం సేవించి వాహనాలు నడిపే (డ్రంక్ అండ్ డ్రైవ్) వారి పట్ల ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హుస్నాబాద్ ఏసీపీ సదానందం హెచ్చరించారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు, రోడ్డు భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మద్యం సేవించి తొలిసారి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తామన్నారు. రెండోసారి కూడా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.15వేల జరిమానా తప్పదన్నారు. ఈ నిబంధనల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవని, జరిమానా చెల్లించని వారికి, ఇతరత్రా ఉల్లంఘనలు ఉన్నవారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష కూడా తప్పదన్నారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

మద్యపానం చేసిన వారికి శిక్షలతో పాటు, రోడ్డు భద్రతా నియమాలు పాటించడంపై కూడా ఏసీపీ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని, తల్లిదండ్రులు మైనర్లకు బండ్లు ఇవ్వకుండా బాధ్యతగా ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, సైలెన్సర్లను మార్చి శబ్ద కాలుష్యానికి పాల్పడటం కూడా శిక్షార్హులని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించి, వ్యక్తిగత భద్రతా నియమాలు తప్పకుండా పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.