28-10-2025 06:49:32 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, డిసిఎంఎస్ చైర్మన్ కుమురం మాంతయ్య, కాగజ్ నగర్, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సుద్దాల దేవయ్య, కుడ్మెత విశ్వనాధ్ లతో జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, ప్రాథమిక సహకార, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలం వరి ధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా కొనుగోలు కేంద్రాలలో రైతుల కొరకు త్రాగునీరు, నీడ కనీస మౌలిక వసతులు, టార్పాలిన్ కవర్లు, గన్ని సంచులు, ప్యాడి క్లీనర్లు, తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు అందుబాటులో ఉండాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఎత్తు ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఆరిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు. పత్తి కొనుగోలులో ఈసారి కపాస్ కిసాన్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నందున ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని, రైతుల వివరాలను యాప్ లో నమోదు చేయాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో కొనుగోలు ప్రక్రియ జరిగేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
సిర్పూర్ నియోజకవర్గ శాసనసభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం యూరియా కొరత ఉన్నప్పటికీ వ్యవసాయ అధికారులు సమన్వయంతో వ్యవహరించి రైతులకు యూరియా సకాలంలో అందించడం అభినందనీయమని తెలిపారు. ఇదే స్ఫూర్తితో వరి ధాన్యం, పత్తి కొనుగోలులో క్రియాశీలకంగా వ్యవహరించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పనిచేయాలని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాలలో 1, దహేగాంలో 1 వరి కొనుగోలు కేంద్రాలు అదనంగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.