30-12-2025 12:00:00 AM
అమరావతి, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా యలమంచిలిలో సోమవారం తెల్లవారుజామున ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. టాటానగర్ నుంచి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ యలమంచిలి చేరుకోగానే బీ1, బీ2 బోగీల్లో మంటలు అంటుకున్నాయి. మంటల్లో చిక్కుకుని ఓ ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు.
లోకో పైలట్లు మంటలను గుర్తించి రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు కిందికి దిగిపోయారు. రెండు బోగీల్లో కలిపి సుమారు ౧౫౦ మందికి పైగా ప్రయాణిస్తుండగా, లోక్‌పైలట్లు సకాలంలో రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. మృతుడిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70) అని రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రమాదం కారణంగా విశాఖపట్నం విజయవాడ రైలు మార్గంలో నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.