14-10-2025 12:35:49 AM
ఇల్లందు టౌన్, అక్టోబర్13 (విజయక్రాంతి): బాణసంచా దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించి అనుమతులను తీసుకోవాలని ఇల్లందు డీఎస్పీ చంద్రబాను సూచించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద బాణసంచా దుకాణదారుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బాణసంచా యజమాని సంబంధిత అన్ని శాఖల అనుమతులను పొందిన తర్వాత మాత్రమే షాపులు ప్రారంభించాలన్నారు.
తాత్కాలిక బాణాసంచా దుకాణాల వద్ద అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇసుక, తగినంత నీరు, అగ్నిమాపక నియంత్రణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. దుకాణదారులు షాప్ కి వచ్చే కస్టమర్లతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. బాణాసంచా దుకాణాల ప్రాంగణంలో టపాసులు కాల్చడం చేసిన, మద్యం సేవించి ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణాల యజమానులు పోటీ తత్వంతో కాకుండా స్నేహపూర్వక వాతావరణం లో వ్యాపారం నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సిఐ తాటిపాముల సురేష్, ఎస్సైలు హసీన, సూర్య, అగ్నిమాపక సిబ్బంది రామారావు తదితరులు పాల్గొన్నారు.