30-01-2026 12:18:00 AM
మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల నిధులు
కొత్త పాలకవర్గంలోనే పనులు ప్రారంభం
పటాన్‌చెరు నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు
పటాన్చెరు, జనవరి 29: నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్ల చొప్పున నిధులను ఇటీవల మంజూరు చేసింది. అయితే బల్ది యా ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఆయా మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలలో మౌళిక వసతుల కల్పనకు ఒక్కో మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేసింది.
పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నియోజకవర్గంలో రూ.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా మున్సిపా లిటీలలో అభివృద్ధి పనులకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. అయితే ఈనెల 27న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడినట్లయింది.
నిలిచిన అభివృద్ధి పనులు...
ప్రభుత్వం మున్సిపాలిటీలలో మౌళిక వసతుల కల్పనకు రూ.15 కోట్లు మంజూరు చేయగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎన్నికల కోడ్ రూపంలో బ్రేక్ పడింది. ఈ నిధులతో ఆయా మున్సిపాలిటీలలో మురికి కాలువలు, సీసీ రోడ్లు, పార్కుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, తాగునీటి సరఫరా తదితర పనులు చేపట్టడానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా కొన్ని మున్సిపాలిటీలో శంకుస్థాపనలు చేయడం జరిగింది. కానీ కోడ్ రావ డంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయా యి. ఫిబ్రవరి 16న కొత్త పాలకవర్గాలు కొలువైన తర్వాతనే ఈ నిధులతో చేటట్టాల్సిన పనులు ప్రారంభమవుతాయని అధికారులు చెబుతున్నారు.