calender_icon.png 27 September, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బీభత్సం

27-09-2025 12:17:50 AM

హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జోరు వాన

  1. జాతీయ రహదారిని ముంచెత్తిన వరద నీరు

గంటల తరబడి ట్రాఫిక్ జామ్

భూపాలపల్లి జిల్లాలో వర్షానికి ఇంటి గోడ కూలి మహిళ మృతి 

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి వరద 

హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేత

మూసీకి పెరుగుతున్న వరద ప్రవాహం

* బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసిం ది. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన వానతో.. వరద బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో గంటల తరబడి వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. హైద రాబాద్‌లో కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నిండుకుండలా మా రడంతో అధికారులు గేట్లు ఎత్తారు. దీంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి ప్రాజెక్టులోకి వరద ఉధృతంగా వచ్చి చేరుతున్నది. భూపాలపల్లి జిల్లాలో వర్షానికి ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. 

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, సెప్టెంబర్ 26: గురువారం రాత్రి నుంచి శుక్ర వారం రాత్రి వరకు హైదరాబాద్, సంగారెడ్డి, వికారబాద్ జిల్లాల్లో కురిసిన వాన వరద బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిని వరద ముంచెత్తడంతో గంటల తరబడి వాహనాలు రోడ్డు మీదే నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వికారాబాద్ జిల్లాలోని కోటిపల్లి ప్రాజెక్టులోకి వరద ఉధృతంగా వచ్చి చేరుతున్నది. భూపాలపల్లి జిల్లాలో వర్షానికి ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందింది. సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి మేఘామృతమై చిరు జల్లులతో మొదలై రాత్రి, శుక్రవారం ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో జాతీయ రహదారి 65పై భారీగా వరద నీరు చేరుకుంది.

ఓఆర్‌ఆర్ ముత్తంగి నుంచి ఇస్నాపూర్ రోడ్డు, లక్డారం నుంచి గణేష్‌గడ్డ వరకు వరద నీరు రోడ్డుపై చేరడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. జాతీయ రహదారి విస్తరణ కోసం తీసిన గుంతల్లో వర్షం నీరు చేరి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో స్థానిక పోలీసులు, మున్సి పల్ సిబ్బంది జేసీబీల సహాయంతో వరద నీటిని తరలించేందుకు డివైడర్లను తొలగించి మరో వైపుకు తరలించారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సైతం భారీ వర్షం కురియడంతో పలు కాలనీల్లోకి వరద నీరు చేరి ఇబ్బందులకు గురయ్యారు. స్థానిక మార్కెట్ యార్డు లో వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. కంది మండలం కౌలంపేట్ గ్రామం ఊదం చెరువులో నీటిమట్టం ప్ర మాదకర స్థాయికి చేరుకుంది. ఏ క్షణాన చెరువు కట్ట కోతకు గురవుతుందోనని గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

పరిమితికి మించి నిండితే ఆ నీటిని కిందకి వదిలేయాలి. కానీ ఇక్కడ  నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఊదం చెరువులో నుం చి నీరు బయటకు రావలసిన నాలాల దారులన్నింటినీ కంకర మట్టి వేసి జేసీబీలతో పూడ్చివేశారు. దీంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు నిండిపోయింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, చెరువు కట్ట తెగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులో నుంచి నీరు బయటకు వెళ్లే విధంగా చేయాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వికారాబాద్ జిల్లాలో కుండపోత 

గురువారం రాత్రి నుంచి వికారాబాద్ జిల్లాలో ఏకధాటిగా కుండపోత కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలోని కోటిపల్లి సాగునీటి ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు చేరడంతో అలుగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది.

తాండూర్ మం డలం బెల్కటూరు వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బిజ్జారం వాగు సైతం పొంగి పొర్లుతుండటంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కాగ్న నదిలోకి భారీ వర్షపు నీరు రావడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. తాండూర్ పట్టణంలోని పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. 

హైదరాబాద్‌లో..

గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుసిన కుండపోతకు హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రోడ్లన్నీ నదులను తలపించగా, లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారాయి. భారీ వర్షాల కారణంగా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా సూచించారు.

నగరంలోని దాదాపు అన్ని ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మియాపూర్ మంజీరా పైపులైన్ రోడ్డు నుంచి కొండాపూర్‌లోని మైహోం మంగళ వైపు వెళ్లే మార్గంలో ఉన్న రైల్వే అండర్‌పాస్ పూర్తిగా నీట మునిగింది. దీంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.

కూకట్‌పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, యూసుఫ్‌గూడ, చార్మినార్, కోఠి, ఉప్పల్ సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నగరంలోని కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రి ప్రాంగణం చెరువును తలపించింది. ఆసుపత్రిలోని వార్డులు, అత్యవసర చికిత్సా విభాగంలోకి భారీగా వరద నీరు చేరడంతో రోగులు, వైద్య సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు.

గోషామ హల్ వద్ద మూసీలో కొట్టుకొచ్చిన కారును ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు. ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. చాదర్‌ఘాట్ నుంచి కోఠి, గోల్నాక వరద ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలా యి. ఎంజీబీఎస్‌లోకి వరద నీరు చేరింది.

ఇంటి గోడ కూలి మహిళ మృతి 

భారీ వర్షానికి ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెంగళూరు గ్రామంలో చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలోని మంద లక్ష్మి ఇంటి గోడ తడిసింది.

ఇంట్లో నిద్రిస్తుండగా గరువారం అర్ధరాత్రి కూలి లక్ష్మిపై పడటంతో మృతి చెందింది. లక్ష్మి భర్త మంద దుర్గయ్య గత కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. కడు నిరుపేదైన మంద లక్ష్మి భర్త దుర్గయ్యకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ రూ.పదివేల ఆర్థిక సాయం అందించారు. 

ఊరి జనం కోసం సాహసం

ఒకవైపు భారీ వర్షం, చుట్టూ చెట్లు, నడి చెరువులో తెగిపడిన విద్యుత్ వైర్లు. అలాంటి చోటకు ఎవరైనా వెళ్తారా? తెలిసి తెలిసి ప్రాణా లకు తెగిస్తారా? అది కూడా వర్షం లో.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండ లం విద్యుత్ సిబ్బంది ఆ సాహసానికి ఒడిగట్టారు. ఊరు జనం కోసం, ఊళ్లో కరెంటు కోసం తమ ప్రాణాలకు తెగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పాలకుర్తి మండ లం ఈసాల తక్కల్లపల్లి గ్రామానికి రామగుండం నుంచి విద్యుత్ సరఫరా జరుగుతున్న 11 కేవీ విద్యుత్ లైన్ శుక్రవారం తెగిపోయి చెరువులో పడిపోయింది.

దాంతో గ్రా మానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పడవ సాయంతో చెరువులోకి వెళ్లి ఆ వర్షంలోనే తెగిపడిన విద్యుత్ తీగలను అక్కడే ఉన్న విద్యుత్ స్తంభం పైకి ఎక్కి పునరుద్ధరించారు. వీరి సాహసోపేతమైన చర్యను చూసి గ్రామస్తులు అభినందించారు. 

ఉప్పొంగుతున్న గోదావరి 

భద్రాచలం ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఇదేవిధంగా పెరుగుతూ సాయంత్రం 6 గంటలకు 44.70 అడుగులకు చేరుకొని మరింత పెరుగుతూనే ఉంది. ఇదే విధంగా రాత్రికి పెరిగి శనివారం ఉదయం తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే వరద సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. లాంచీలను సైతం సిద్ధంగా ఉంచారు. 

విమానాల దారి మళ్లింపు

గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించడం లేదు. శుక్రవారం అధికారులు పలు విమానాలను ల్యాండింగ్‌కు అనుమతి నిరాకరించి దారి మళ్లించారు.

తెల్లవారుజాము నుంచే పలు విమానాలను ముందస్తు చర్యల్లో భాగంగా ముంబై, పూణే, కోలకత్తాకు చెందిన ఇండిగో విమానాలను విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు మళ్లించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో కెమికల్ ట్యాంకర్‌ను ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.