calender_icon.png 30 October, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొంథా తుఫాన్ ఉగ్రరూపం – చివ్వెంలలో జలప్రళయం!

29-10-2025 05:11:14 PM

చివ్వెంల,(విజయక్రాంతి): మొంథా తుఫాన్ ప్రభావంతో చివ్వెంల మండల వ్యాప్తంగా ఆకాశం తెరచాపి వర్షాలు కురుస్తున్నాయి. గంటల కొద్దీ కురిసిన వర్షాలతో గ్రామాలు జలమయం అయ్యాయి. ప్రధాన వీధులు, ఇంటి పరిసరాలు, వ్యవసాయ పొలాలు అన్నీ నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా పిఎసిఎస్ చివ్వెంల ఆధ్వర్యంలో నడుస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్ల కుప్పలు వర్షపు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. వడ్లు తడిసి నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వడ్లను కాపాడేందుకు తారు షీట్లు, సిమెంట్ బ్లాకులు, ఇనుప పైపులతో కప్పేందుకు ప్రయత్నించినా వర్షపు నీటి ఒత్తిడికి ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదేవిధంగా గ్రామంలోని ఇళ్లలోకి నీరు చొచ్చుకెళ్లడంతో ప్రజలు ఇళ్లలోనే ఇరుక్కుపోయారు. పలు కాలనీల్లో వీధులు చెరువుల్లా మారి, వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వర్షం తగ్గకపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. గ్రామస్థులు అధికారులు తక్షణమే స్పందించి నీరు బయటకు పోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని, పంట నష్టాలకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.