calender_icon.png 28 July, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రినగరికి వరద ముప్పు!

25-07-2025 12:37:57 AM

  1. గతేడాది వానకాలంలో పోటెత్తిన వరద
  2. తూతూమంత్రంగా నాలాల మరమ్మతులు
  3. నాలాల పూడిక తీత అధికారులు చేతివాటం
  4. మానుకోట జిల్లాలోనూ పారిశుధ్య తంటాలు

హనుమకొండ/మహబూబాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కొందరు అధికారుల మబ్బునిద్ర, మరికొందరు అధికారుల చేతివాటం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతుంది. గతేడాది వానకాలంలో కుండపోత  వానలకు వరంగల్, హనుమకొండ జలమయంగా  మారాయి. ఆక్రమణల కారణంగా నాలాలు  కుంచించుకుపోయి, వరద నీటితో కాలనీలు చెరువులను తలపించాయి. అయినా అధికారుల్లో మార్పు రాకపోవడం దారుణం.

తాజాగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరవాసులు  తమ కాలనీలు ముంపునకు గురవుతాయని ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాల కారణంగా త్రి నగరిలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. రోజుల తరబడి వర్షాలు కురవడంతో ఇండ్లలోకి నీరు చేరి చెరువులు, కుంటలను మరిపించాయి. అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ సాధారణ స్థితికి చేఏరేందుకు నెలల కాలం పట్టిందని పలువురు అంటున్నారు. 

ప్రభావిత ప్రాంతాల్లో చర్యలేవీ?

ఈ యేడు సాధారణ వర్షపాతమే నమోదైనప్పటికీ రానున్న రోజుల్లో వరద ప్రవాహానికి గురయ్యే కాలనీల్లో ఎలాంటి నిర్మూలన చర్యలు చేపట్టకపోవడం కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. కాజీపేట, వడ్డేపల్లి, సమ్మయ్యనగర్, పోచమ్మకుంట, లష్కర్ బజార్, బాలసముద్రం, న్యూ బస్స్టేషన్, కుమార్పల్లి, పెద్దమ్మగడ్డ, జ్యోతిబసు కాలనీ, సుందరయ్యనగర్, గుండ్ల సింగారం, ఎల్ వెంకట్రామయ్య నగర్,

ములుగు రోడ్డు, కాపు వాడ, అలంకార్ జంక్షన్, నయీమ్ నగర్, వరంగల్ లోని జక్కులుద్దీన్ కాలనీ, శాఖరాశి కుంట, శివనగర్, వరంగల్ అండర్ బ్రిడ్జి, లేబర్ కాలనీ తదితర ప్రాంతాలన్నీ జలమయం, వరద ముంపుకు  గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

శిథిలావస్థలో నాలాలు

భద్రకాళి, వడ్డేపల్లి, గోపాలపురం తిట్టే కుంట, దీన్ దయాల్నగర్ తదితర చెరువు కుంటలకు సంబంధించిన నాలాలు శిథిలావస్థకు చేరాయి. పెరుగుతున్న జనాభా కారణంగా కొత్త కాలనీలు వెలుస్తున్నా ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని విమర్శలు ఉన్నాయి.

ఇప్పటికైనా వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు దృష్టి సారించి, నాలాల ఆధునీకరణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. చెరువులు, కుంటల భూములను రక్షించి వరద ముప్పు నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కేసముద్రంలో మూసుకుపోయిన డ్రైనేజీలు

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ప్రధాన రహదారుల వెంట ఉన్న డ్రైనేజీలను షాపులు, ఇండ్ల యజమానులు సిమెంటు కాంక్రీట్ స్లాబ్ పైకప్పులతో మూసివేయడంతో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది తంటాలు పడాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.౫౦ లక్షల నిధులను కేటాయించారు.

ఆ నిధులతో మార్కెట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఒకవైపు, చిన్న బడి సెంటర్ నుంచి  పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా, అమరవీరుల స్థూపం నుంచి చిన్న బడి వరకు పెద్ద డ్రైనేజీ కాలువ నిర్మించారు. దీనితో కొంతకాలం వర్షపు నీరు తో పాటు డ్రైనేజీ నీరు కూడా సులువుగా దిగువకు వెళ్ళేది. క్రమక్రమంగా రోడ్ల వెంట నిర్మాణాలు పెరగడం, షాపులు, షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడంతో డ్రైనేజీ కాలువలను క్రమక్రమంగా సిమెంటు పైకప్పులతో మూసివేతకు గురయ్యాయి.

ఇక కొందరైతే ఏకంగా కాలువ ఆనవాళ్లు కూడా లేకుండా చేసి పక్క నిర్మాణాలు చేపట్టడం, మరికొందరు డ్రైనేజీ పైనే నిర్మాణాలు చేపట్టడంతో డ్రైనేజీలు పూర్తిగా కనిపించకుండా పోయా యి. ఈ క్రమంలో ఎక్కడైనా చెత్త తడితే మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్గంధ భరితంగా మారుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది డ్రైనేజీలో నిలిచిపోయిన చెత్తను తొలగించడానికి పడరాని పాట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది.

అక్కడక్కడ మ్యాన్ హోల్ ఏర్పాటు చేయకపోవడంతో డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయలేకపోతున్నారు. భారీ వర్షాలకు వచ్చే వరద నీరు డ్రైనేజీ ద్వారా దిగువకు వెళ్లకుండా ఎక్కడికక్కడే స్తంభించిపోతుంది. చెత్త, ప్లాస్టిక్ వస్తువులతో డ్రైనేజీ కాలువలు పూర్తిగా నిండిపోవడం వల్ల పట్టణంలోని ప్రధాన రహదారులు వర్షాకాలం లో కాలువలను తలపిస్తున్నాయి.

డ్రైనేజీ ద్వారా వరద నీరు వెళ్లకుండా రోడ్డుపైనే ప్రవహిస్తుండడంతో రాకపో కలకు ఇబ్బందిగా మారుతో ంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మూసివేతకు గురైన డ్రైనేజీ కాలువ లను వినియోగించే విధంగా చర్య లు తీసుకోవాలని, పారిశుద్ధ్య సిబ్బందికి నిరంతరం ఇబ్బందులు లేకుండా చెత ్తను తొలగించే విధంగా డ్రైనేజీ కాలువలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.