15-08-2025 12:20:08 AM
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, జిల్లా ఎస్పీ జానకి
భూత్పూర్ ఆగస్టు 14 : భారీ వర్షాల కారణంగా భూత్పూర్ మండల పరిధిలోని షేర్ పల్లి దగ్గర కోమటికుంట అలుగు ఉదృతంగా ప్రవహించింది. దీంతో నేషనల్ హైవే 44 ఒకసారిగా వరద నీరు వచ్చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిఐజి ఎల్ ఎస్ చౌహన్, జిల్లా ఎస్పీ డి జానకి వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు, కుంటలు నిండిపోతోన్నాయని, అలుగు వల్ల ట్రాఫిక్ అంతరాయం జరగకుండా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా నేషనల్ హైవే వంటి రద్దీ మార్గాలపై నిరంతర నిఘా ఉంచి, అవసరమైన చర్యలు తీసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు.
అలాగే వరదలలో మనుషులు, పశువులు చిక్కుకున్న సందర్భంలో వెంటనే డయల్ 100 కి, పోలీసులకు సమాచారం అందించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిశీలనలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్, భూత్పూర్ ఎస్‌ఐ చంద్రశేఖర్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.