15-08-2025 12:20:40 AM
మునిపల్లి, ఆగస్టు 14 : మునిపల్లి మండలం ఖమ్మంపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణ చేయకపోవడంతో చెత్తంతా రోడ్ల పక్కన పేరుకుపోయింది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పేరుకుపోయిన చెత్త దుర్వాసనతో కంపు కొడుతుంది. చెత్తంతా జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల పక్కనే ఉండడంతో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.
చెత్త సేకరించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను నడిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెత్త వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఈ విషయంపై గ్రామ పంచాయతీ అధికారి శివ కుమారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి వ్యాధుల భారి నుండి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.